సాక్షి, బెంగళూరు : కట్న, కానుకలు అవసరం లేదన్నారు... తీరా పెళ్లి మండపంలో గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు పెళ్లి కుమార్తె తండ్రిని కూడా అవమానించారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె ప్రత్యేక అలంకరణతోనే మంటపానికి చేరుకుని పెళ్లి నిలిపి వేయించిన సంఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలు... బెంగళూరుకు చెందిన ఆశీశ్ ఇంటీరియర్ డిజైనర్. చత్తీస్‌ఘడ్ మురదాబాద్‌కు చెందిన జ్యోతి ఎంటెక్ పూర్తి చేసింది. ఓ వెబ్‌సైట్‌లో పెళ్లి వివరాలు పెట్టడంతో ఇరువైపుల వారు పరస్పరం మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమయంలో ఎటువంటి కట్న కానుకల ప్రస్తావన రాలేదు. అన్ని విధాల నచ్చడంతో ఈనెల 14న చత్తీస్‌ఘడ్‌లోని మురదాబాద్‌లోని పార్క్‌స్కైర్ హోటల్‌లో జ్యోతి, ఆశీశ్ పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందు రోజు బంధువులతో కలిసి రిసెప్షన్ కూడా చేశారు. 14న ఉదయం పెళ్లి మరి కొద్ది క్షణాల్లో జరుగుతుందనగా పెళ్లి కుమారుడు తండ్రి కట్నం, కారు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో వధువు తండ్రి ఈ విషయాన్ని కుమార్తె జ్యోతి దృష్టికి తీసుకెళ్లాడు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె పెళ్లి కుమారుడి మనసు మార్చడానికి యత్నించింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నాం. మీరు కోరిన కోరికలు భవిష్యత్‌లో తీర్చుకుంటాం, పెళ్లి ఆపడం వద్దు అంటూ సవినయంగా పెళ్లి కుమారుడికి విన్నవించింది. అయినా ఆశీశ్, అతని తల్లిదండ్రులు, బంధువులు కట్నం ఇస్తేనే పెళ్లి లేదంటే లేదు అంటూ ఖరాకండిగా చెప్పేశారు. దీంతో జ్యోతి కూడా పెళ్లి మండటపంలోనే కట్న కానుకలు ఆశించే పెళ్లి కుమారుడు వద్దు, పెళ్లీ వద్దు అంటూ తెగేసి చెప్పింది. అంతటితో ఆగకుండా పెళ్లి మంటపం నుంచి వెళ్లి పోవాల్సిందిగా ఘాటుగా హెచ్చరించింది. దీంతో జ్యోతి తన తండ్రితో కలిసి ఆశీశ్, అతని తండ్రి నరేశ్‌పై మఝులా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ... పెళ్లికి ముందు కట్న కానుకల ప్రస్తావన లేదని, పెళ్లి ముహూర్తం సమయంలో కట్నం డిమాండ్ చేశారని, దీంతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. జ్యోతి సాహసోపేత నిర్ణయాన్ని అందరూ అభినందించారు. ఇదే సమయంలో పెళ్లి కుమారుడు ఆశీశ్, అతని తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment