విశాఖపట్నం, పాయకరావుపేట: వరకట్న వేధింపులకు ఓ నవ వధువు బలైంది. పెళ్లై రెండు నెలలు కూడా గడవక ముందే తనువు చాలించింది. భర్త వేధింపులు తాళలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె ఆత్మహత్యకు అల్లుడే వేధింపులే కారణమని మృతురాలి తండ్రి లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పాయకరావు పేటలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం మన్నె గూడెం గ్రామానికి చెందిన మూలంపల్లి ఉమ(25)కు, అదే రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పెరక సింగారం గ్రామానికి చెందిన వాసంశెట్టి వేణుగోపాల్‌తో ఈఏడాది ఫిబ్రవరి 20న వివాహం జరిగింది.
వివాహ సమయంలో వరుడు కుటుంబానికి కట్నం కింద రూ.5 లక్షల నగదు, రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారు. మరో రూ.3 లక్షలు తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వరుడు వేణుగోపాల్ నక్కపల్లి సమీపంలో ఉన్న హెటెరోకంపెనీలో పనిచేస్తున్నాడు. పాయకరావుపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని నూతన దంపతులు కాపురముంటున్నారు. రెండు రోజుల క్రితమే ఇల్లు మారారు. పెళ్లయినప్పటినుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు.భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని మృతురాలి తండ్రి తెలిపాడు. ఇతని వేధింపులు తాళలేక ఉమ మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన మృతురాలి తల్లిదండ్రులు బుధవారం పాయకరావుపేట చేరుకుని భోరున విలపించారు. అడిగినంత ముట్టజెప్పినా సరే తన కూతురును అల్లుడే పొట్టన పెట్టుకున్నాడంటూ ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చే కల్యాణ లక్ష్మి పథకం కోసం సంతకం చేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేశాడని, ఈవిషయంలోకూడా గొడవ పడేవాడని విలపించాడు. తన మృతికి అల్లుడే కారణం అంటూ పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment