పెళ్లికి ముందు వధూవరులు శివాజీ, సృజన
పెళ్లంటే తాళాలు, తప్పట్లు, పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడుముళ్లు, బంధువుల సందడి ..ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, పెళ్లి ఇంట సందడే సందడి. ఘనంగా వేడుకకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరేం జరిగిందో...వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. ఆ సందడంతా క్షణకాలంలో చెదిరిపోయింది. బంధువులంతా షాక్ నుంచి తేరుకోలేదు..ఏమైందో ఒకటే ఆందోళన...ఆస్పత్రిలో చేర్పించారు. రాత్రంతా చికిత్స అందించారు. గురువారం ఉదయం నవ వధువు మృతి చెందింది. ఆమె మృతి వెనుక ఎన్నో అనుమానాలు...ఎన్నో సందేహాలు..పెళ్లింట సమాధానం చెప్పలేని ప్రశ్నలు...
సాక్షి, మధురవాడ (భీమిలి): మధురవాడ కళానగర్‌కు చెందిన టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, హైదరాబాదు చందానగర్ పాపిరెడ్డి కాలనీ, ఆర్‌జీకే కాలనీ బ్లాక్ నెంబరు.58 జీఎఫ్ 6లో నివాసం ఉంటున్న ముంజేటి సాయి సృజన (22)కు వివాహం నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం ఈ నెల 7న మధురవాడలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఇందులో భాగంగా 8వ తేదీన ప్రదానం పూర్తయ్యింది. అదే రోజు సాయంత్రం సంగీత్ కూడా జరిపించారు.
వధువు రుతుక్రమం నుంచి తప్పించడానికి 5వ తేదీ నుంచి 10 వరకు మాత్రలు వాడింది. బుధవారం ఉదయం 7 గంటలు సమయంలో వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. దీంతో వైద్యం నిమిత్తం వెంకోజీపాలెంలోని అమ్మ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకు వచ్చారు. అదే రోజు 4గంటలకు ఇంటి వద్దనే కాళ్ల గోరు సంబరం, పెళ్లి కూతురుగా అలంకరణ, ఇతర కార్యక్రమాలు కూడా జరిపించారు. 9.45 గంటలకు మధురవాడ కళానగర్‌లోని శివాజీ ఇంటి సమీపంలోని వివాహ వేదిక వద్దకు తీసుకు వచ్చి పెళ్లి తంతు ప్రారంభించారు.
యువతి బ్యాగులో లభ్యమైన గన్నేరు పప్పు మాదిరిగా ఉన్న తొక్కలు
మరి కొద్ది సయంలో వేద మంత్రాలు నడుమ తాళి బొట్టు కడతాడనుకునే క్రమంలో రాత్రి 10.10 గంటలకు వధువు కుప్పకూలిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి మొదట తరలించారు. పరిస్థితి మెరుగవుతుందని భావించి మళ్లీ 2 గంటలకు కూడా మరో ముహూర్తం ఖరారు చేసి వధువు కోసం పెళ్లి మండపం వద్ద బంధువులు వేచి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వధువు పరిస్థితి విషమించడంతో ఇండస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందిందని వైద్యులు సమాచారం ఇచ్చినట్టు మధురవాడ జోన్(విశాఖ నార్త్ జోన్) ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు చెప్పారు.
గుర్తు తెలియని విషపదార్థం తీసుకోవడం వల్ల మృతిచెందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే మృతికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. మృతురాలి తండ్రి ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు బీకాం పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. వధువు సృజన కుటుంబం శ్రీకాకుళం జిల్లా జలుమూరు నుంచి ఉపాది నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈశ్వరరావు ట్రెడెంట్ లైఫ్ కెమికల్స్ కంపెనీలో మెయింటినెన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మృతురాలి బ్యాగులో గన్నేరు తొక్కలు
వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమయ్యాయి. గన్నేరు పప్పు తిని ఉంటుందా? మరేమన్న కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..)
Comments
Please login to add a commentAdd a comment