పట్టపగలే దారుణ హత్య
మదనపల్లె టౌన్: పట్టణంలో శుక్రవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక ఫైనాన్సియర్‌ను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పోలీసుల కథనం మేరకు... మదనపల్లె పట్టణం దేవళం వీధికి చెందిన షేక్ సాబ్‌జాన్ కుమారుడు కాలేషావలి అలియాస్ మిట్టు(36) పాత ద్విచక్ర వాహనాలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య షబానా, పిల్లలు షోహాన్, సానియా, సిద్ధిక్ ఉన్నారు. అతను రోజు మాదిరిగానే ఫైనాన్స్ కలెక్షన్లకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానిక రాజీవ్‌నగర్ మీదుగా గొట్టిగానిచెరువులోని మసీదుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. అతన్ని ఆటోలో వెంబడించిన దుండగులు రాజీవ్‌నగర్‌లో ద్విచక్ర వాహనాన్ని ఆపారు.
స్థానికులు చూస్తుండగానే వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు. బంధువులే చంపారుతన భర్తను దగ్గర బంధువులే చంపారని సంఘటనా స్థలానికి వచ్చిన మృ తుని భార్య షబానా ఆరోపించింది. తమ కుటుంబానికి ఇంటి విషయమై దాయాదులతో గొడవలు జరుగుతున్నట్లు పేర్కొంది. అంతేగాక తాత వారసత్వంగా ఇచ్చిన ఇంటి విషయమై కోర్టులో 5 ఏళ్లపాటు కేసు కూడా నడిచిందని, ఇటీవలే ఆ ఇల్లు తన భర్త కాలేషావలికి చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొంది.
దీన్ని జీర్ణించుకోలేకనే తమ వీధికి చెందిన ప్రత్యర్థులు సుల్తాన్ తదితరులు ఈ దారుణానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరైంది. హత్య విషయం తెలుసుకున్న సీఐ మురళి, ఎస్‌ఐలు దస్తగిరి, గంగిరెడ్డి అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. సంఘటనా స్థలంలో పడి ఉన్న ద్విచక్ర వాహనం, నిందితులు వదిలి వెళ్లిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పాతనేరస్తునిపై అనుమానాలు
మృతుని దగ్గర బంధువు సుల్తాన్ పలు దోపిడీలు, హత్య కేసుల్లో నిందితుడని, అతనే హత్యచేసి ఉంటాడని సీఐ ముర ళి అనుమానం వ్యక్తం చేశారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని చెప్పారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు.
నాన్నను ఒక్కసారి చూడాలి
అమ్మా... అన్నా.... అంకుల్ ఫ్లీజ్.. నాన్నను ఒక్కసారి చూడాలి...అంటూ మృతుని పెద్ద కుమార్తె సానియా విల పించడం అక్కడి వారిని కదిలించింది. భర్త ఇకలేడని తెలిసీ షబానా గుండెలు బాదుకుంది. స్పృహ తప్పి పడిపోయింది. బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.