- వైద్యుడి ఇంట్లో రెండు గంటల హల్‌చల్
- 40 తులాల బంగారం, 5 లక్షల నగదు దోపిడీ
సాక్షి, బళ్లారి : ముసుగు దొంగలు బళ్లారిలో బీభత్సం సృష్టించారు. వైద్యుడి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో భయబ్రాంతులకు గురి చేసి రెండు గంటపాటూ నిర్బంధంలో ఉంచారు. 40 తులాల బంగారు నగలు, రూ. 5లక్షల నగదు దోచుకొని ఉడాయించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కీళ్లు, ఎముకల వ్యాధి నిపుణుడు, అరుణోదయ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సతీష్ కందుల నగరంలోని హవంబావిలో నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారు జామున 10 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు కాంపౌండ్ గోడ దూకి వంట గది కిటికీ పగులగొట్టి లోపలకు ప్రవేశించారు.
సతీష్ కందుల తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి సతీష్ కందుల ఉన్నారా? అని ప్రశ్నిస్తూ రాడ్లు, కత్తులు చూపి భయభ్రాంతులకు గురి చేశారు. అరిచినా, ఫోన్ చేసినా చంపుతామంటూ హెచ్చరించారు. తాము ఎలా చెబితే అలా చేయాలని సూచించారు. సెల్‌ఫోన్లు నీళ్లలో పడవేశారు. బీరువా తాళం తీసుకొని 40 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదు దోచుకున్నారు. పక్క గదిలో నిద్రిస్తున్న సతీష్ సోదరుడు సురేష్ గదిలోకి చొరబడి అతన్ని బెదిరించారు. ఇంట్లో ఏమైనా నగదు, బంగారు ఉన్నాయా అని ఆరా తీశారు.
తర్వాత వైద్యుడి వదిన ప్రసన్నలక్ష్మి మెడలో ఉన్న మంగళ సూత్రం లాక్కున్నారు. అనంతరం మొదటి అంతస్తులో నిద్రిస్తున్న సతీష్ కందుల గది తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమై ఉడాయించారు. జిల్లా ఎస్‌పీ చేతన్‌సింగ్ రాథోడ్ , ఏఎస్‌పీ సీ.కే.బాబా, డీఎస్‌పీలు రుద్రముని, మురగణ్ణ, సీఐలు, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. జాగీలం చోరీ జరిగిన ఇంటి నుంచి సిరుగుప్ప రోడ్డులో కిలోమీటర్ వరకు వెళ్లి ఆగిపోయింది. అదేవిధంగా నిపుణులు నిందితుల వేలిముద్రలు సేకరించారు. బళ్లారి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం నాల ుగు బృందాలు
రంగంలోకి దిగినట్లు ఎస్‌పీ తెలిపారు.
దొంగలు వెళ్లిన తర్వాత తెలిసింది : రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి ఎవరిగదుల్లో వారు నిద్రించారు. నాన్న గది, సోదరుడు గదిలోకి దుండగులు ప్రవేశించి బంగారు, నగదు మొత్తం దోచుకున్నారు. నా గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగలు వెళ్లిపోయే వరకు ఏమి జరిగిందో తెలియలేదు. సెక్యూరిటీని పెట్టుకోలేదు.
-డాక్టర్ సతీష్ కందుల