వడ్డనకు రెడీ
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బస్సు చార్జీల వడ్దన కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీజిల్ ధర పెంపు, ఇతర ఖర్చుల్ని సాకుగా చూపుతూ చార్జీల పెంపు అవశ్యాన్ని ప్రజలకు వివరించేందుకు రవాణాశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేర కు చెన్నైలో బుధవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చార్జీల చిట్టాను ప్రకటించనున్నారు. ఎనిమిది డివిజన్లు, 21 మండలాలతో రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ రూపుదిద్దుకుంది. దీని పరిధిలో 20,654 బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 2.1 కోట్ల మంది ప్రయూణిస్తున్నారు. రాష్ట్ర రాజధాని చెన్నైలోనే రోజుకు 55 లక్షల మంది బస్సు సేవల్ని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సంస్థ ఏళ్ల తరబడి నష్టాల్లోనే నడుస్తోంది. డీఎంకే హయూంలో చార్జీల పెంపుపై దృష్టి పెట్టకపోవడంతో సంస్థ దివాల తీసే స్థాయికి చేరింది. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక ఈ సంస్థను బలోపేతం చేస్తూ చర్యలు తీసుకుంది. 2012లో చార్జీల్ని పెంచడంతోపాటు సంస్థను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని కేటాయించింది. ఏడాదికి వెయ్యి కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంది. ఆ తర్వాత చార్జీల పెంపు మీద దృష్టి పెట్టలేదు.
రూ.5 వేల కోట్ల మేరకు నష్టం
ప్రభుత్వం సహకారం అందిస్తున్నా రాష్ట్ర రవాణా సంస్థ గత ఏడాది రూ.5 వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. పెరుగుతున్న డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు. సిబ్బంది వేతనాలు, పరిపాలనా పరమైన ఖర్చులు వెరసి నష్టాన్ని మరింత పెంచాయి. 2012లో లీటర్ డీజిల్ ధర రూ.46.50 ఉండగా రెండేళ్ల వ్యవధిలో డీజిల్ ధర రూ.15.14 మేరకు పెరిగింది. రవాణా సంస్థ బస్సులు రోజుకు కోటీ 589 కిమీ మేరకు ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ బస్సులు లీటరుకు ఆరు కిమీల దూరం పయనించాల్సి ఉంది. 4.8 కిమీలు మాత్రమే న డిపే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రెండేళ్లలో డీజిల్ భారం ఆ సంస్థ నెత్తిన గుదిబండగా మారింది. ఏడాదికి సుమారు రూ.840 కోట్ల నుంచి 1000 కోట్ల మేరకు డీజిల్ ధరల పెంపు రూపంలో అదనపు భారం పడుతోంది. అలాగే ప్రభుత్వ సాయం సకాలంలో అందక పోవడం వల్ల అనేక డివిజన్లు, మండలాల్లో సిబ్బంది వేతన చెల్లింపు మరింత భారంగా మారింది.
నెలనెలా డీజిల్ ధర పెంపు, బస్సుల మరమ్మతులు, ఇతర ఖర్చులు నానాటికీ పెరుగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చార్జీల వడ్డనకు రవాణా సంస్థ సిద్ధమైంది. రెండేళ్లుగా ఎదుర్కొంటున్న నష్టాల్ని ఎత్తి చూపడంతోపాటు తాము అందిస్తున్న విశిష్ట సేవల్ని వివరిస్తూ చార్జీల పెంపు అవశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రవాణా సంస్థ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇటీవల ఆంధ్ర, కర్ణాటక, కేరళ, రాష్ట్రాల్లో పెరిగిన చార్జీల్ని పరిశీలిస్తూ రాష్ట్రంలోనూ ఏ మేరకు చార్జీల్ని పెంచాలన్న అంశంపై డివిజన్, మండల అధికారులతో రవాణా శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలో చేశారు. బుధవారం చెన్నై వేదికగా జరిగిన ఈ సమీక్షలో బస్సు చార్జీల్ని పెంచక తప్పదన్న తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ మేరకు చార్జీల్ని పెంచాలనే విషయంపై చర్చించి నివేదికను సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ నివేదికను రాష్ర్ట ప్రభుత్వానికి పంపించి చార్జీల వడ్డనకు రెడీ అయ్యారు. సీఎం జయలలిత ఆమోదం తెలిపిన మరుక్షణం కొత్త చార్జీల చిట్టా వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైల్వే చార్జీల వడ్డన, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, చక్కెర ధరకు రెక్కలు వెరసి ప్రజల నడ్డి విరుస్తున్న తరుణంలో బస్సు చార్జీల మోత రాష్ట్ర ప్రజల జీవితాల్ని ఏ మేరకు పిప్పి చేయబోతున్నాయో వేచి చూడాల్సిందే.