
చెరువులో బస్సు బోల్తా
* ముగ్గురి జల సమాధి
* 25 మందికి గాయాలు
* ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి జీఎం సిద్దేశ్వర్
దావణగెరె : ప్రైవేట్ బస్సు అదుపు తప్పి శాంతిసాగర (సూళెకెరె) చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు జలసమాధి అయ్యారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జిల్లాలోని చెన్నగిరి తాలూకాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు దావణగెరెలోని ప్రైవేట్ బస్టాండ్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అమరేశ్వర అనే ప్రైవేట్ బస్సు చెన్నగిరికి బయలుదేరింది. 4.10 గంటల సమయంలో మార్గమధ్యంలో శాంతిసాగర చెరువు పక్క నుంచి వెళుతున్న సమయంలో బస్సు అదుపుతప్పి చెరువులోకి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నారు.
ఈ సంఘటనను గమనించిన సమీపంలో ఉన్న వారు, గ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. 25 మందికి పైగా గాయపయడ్డారు. క్షతగాత్రులను దావణగెరె, చెన్నగిరి, నల్లూరు, కెరెబిళచిలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర్, చెన్నగిరి ఎమ్మెల్యే వడ్నాళ్ రాజణ్ణ, మాయకొండ ఎమ్మెల్యే కే.శివమూర్తి నాయక్‌లతో పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ ఎంబీ బోరలింగయ్య, ఏఎస్పీ భావిమని, డీఎస్పీ నేమగౌడ, సీఐ రవినాయక్, ఎస్‌ఐలు మహ్మద్ నూరుల్లా, సతీష్ నాయక్ తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు.
పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై బసవాపట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుల్లో ఇద్దరిని చెన్నగిరి తాలూకా దిగ్గేనహళ్లికి చెందిన విజయమ్మ (30), రాణిబెన్నూరు తాలూకాకు చెందిన మహాదేవప్ప (45)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును వెలికి తీసే పనులు చేపట్టారు.