ఓటుకు నోటుపై తమిళుడిపై విమర్శలు
సాక్షి, చెన్నై : ‘ తమిళుడు అంటే ఓటుకు నోటు’ తీసుకునే వాడు. అన్న ముద్ర పడిందని, ఎగతాళి కూడా చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు సంప్రదాయం అవసరమా..? అని ప్రశ్నిస్తూ, ఇకనైనా మారండంటూ తమిళులకు హితవు పలికారు. శివగంగై లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కోల్పోయిన తన వైభవాన్ని, హవాను చేజిక్కించుకోవడం లక్ష్యంగా పి. చిదంబరం ముందుకు సాగుతున్నారు. ఆదివారం, లేదా సెలవు దినాల్లో అయితే చాలు అన్ని పనుల్ని పక్కన పెట్టి నియోజకవర్గంలో పర్యటించే పనిలో పడ్డారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించడం లక్ష్యంగా, ఆయా గ్రామాల్లోని పార్టీ వర్గాలు, ముఖ్యులతో మంతనాల దిశగా తన పయనం సాగిస్తున్నారు.
తాజాగా ముదునన్‌దిడల్‌లో పర్యటించిన ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయడంతో పాటు తమిళుడి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు : యూపీఏ తీసుకొచ్చిన పథకాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. వంద రోజుల పనికి ఆహారం పథకం ద్వారా పేద కూలీలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో పేదల కూలీలతో పాటుగా కా ర్మిక, వ్యవసాయ తదితర వర్గాల వారు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే నినాదం, కుట్రలతో అనేక పంది కొక్కులు వచ్చాయని, కాంగ్రెస్ దెబ్బకు పారి పోయాయని ఎద్దేవా చేశారు.
విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నా, ఇంత వరకు విద్యా రుణాలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు, రాను రాను, దేశంలో ఏమీ లేకుండా చేస్తారేమోనని మండి పడ్డారు. ఇక, ఓటుకు నోటు సంప్రదాయమా..? అని ప్రశ్నిస్తూ, తీవ్రంగా మండి పడ్డారు. ఎక్కడికైనా వెళ్లి తమిళుడు అని పరిచయం చేసుకుంటే చాలు ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చటుక్కున ఓటుకు నోటు తీసుకునే వాళ్లే కదా..? అని ఎద్దేవా చేస్తున్నారని పేర్కొన్నారు. నోటు తీసుకుని ఓట్లు వేయబట్టే చులకనకు గురి అవుతున్నామని, ఇకనైనా ఆ పద్దతికి స్వస్థి పలకండని హితవు పలికారు.
ఇకనైనా మారండి
Published Mon, Jun 15 2015 4:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM
Advertisement
Advertisement