సెంట్రల్ రైల్వే స్టేషన్లో గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుళ్లతో రాష్ట్రం ఉలిక్కి పడింది. ఈ ఘటన విచారణను సీబీసీఐడీ వేగవంతం చేసింది.
సాక్షి, చెన్నై: సెంట్రల్ రైల్వే స్టేషన్లో గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుళ్లతో రాష్ట్రం ఉలిక్కి పడింది. ఈ ఘటన విచారణను సీబీసీఐడీ వేగవంతం చేసింది. బెంగళూరు, చెన్నై చుట్టూ విచారణ సాగుతోంది. కొన్నేళ్ల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న అతిపెద్ద పేలుడు ఘటన కావడం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను విచారణలను పరిశీలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యూయి. బెంగళూరులో పట్టుబడిన అనుమానితుల వద్ద విచారణ వేగవంతంగా ఓ వైపు సాగుతుంటే, పాట్నాలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనతో చెన్నై పేలుడుకు పోలికలను గుర్తించి ఉన్నారు.
దీంతో పాట్నాలో పట్టుబడి బీహార్ చెరలో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్ర వాదులను విచారించేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. దీంతో ఇద్దరు అధికారులతో కూడిన ఓ బృందం ఆదివారం పాట్నాకు బయలుదేరి వెళ్లింది. అక్కడి అధికారుల సహకారంతో తీవ్రవాదులను విచారించిన అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇక, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా మరో వ్యక్తిని గుర్తించారు. ఇది వరకు ఓ వ్యక్తి హడావుడిగా సంఘటన జరిగిన రోజున తొమ్మిదో నెంబర్ ఫ్లాట్ ఫారం నుంచి పరుగులు తీసిన దృశ్యాలు విడుదలయ్యాయి.
మరో వ్యక్తి అతడిని అనుసరించే రీతిలో పరుగులు తీస్తుండడంతో ఆ వ్యక్తుల ఆచూకీ కనిపెట్టే పనిలో సీబీసీఐడీ వర్గాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు తత్కాల్ టికెట్లు తీసుకుని ఉం డడం, ఆ చిరునామాలు నకిలీవిగా తేలి ఉన్నాయి. ఇందులో ఓ వ్యక్తి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ సాగుతోంది. అయితే, ఆ ఫోన్ గత కొన్ని నెల లుగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టు తేలింది. అప్రమత్తం: కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది. రాష్ట్రంలోని మదురై, తిరునల్వేలి, సేలం, తిరుచ్చి, కోయంబత్తూరు నగరాలను, ప్రధాన రైల్వే జంక్షన్లను నిఘా వలయంలోకి తెచ్చారు. ప్రతి రైల్వే స్టేషన్లోను మెటల్ డిటెక్టర్ల ద్వారా ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒక్కో స్టేషన్లో ఇద్దరేసి ఆయుధ బలగాల సిబ్బందిని రంగంలోకి దించారు. అలాగే, డాగ్, బాంబుస్క్వాడ్‌లు ప్రధాన స్టేషన్లలో మకాం వేసి తనిఖీలు చేస్తున్నాయి.
ఉత్తరాది నుంచి వచ్చే ప్రతి రైలును, ఆయా నగరాల గుండా ఉత్తరాదికి వెళ్లే రైళ్లను ప్రధాన స్టేషన్లలో తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. జెమినీ, కత్తి పార వంతెనలకు, ఎల్‌ఐసీ, సచివాలయం, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక భద్రత కల్పించారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీల్లో నిమగ్నం అయ్యారు. దౌత్య కార్యాలయాలకు: చెన్నైలో పట్టుబడిన ఐఎస్‌ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ వద్ద కేంద్ర ప్రత్యేక బృందం జరిపిన విచారణతో రాష్ట్ర రాజధాని నగరంలోని అన్ని దౌత్యకార్యాలయాలు, బెంగళూరులోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయాన్ని నిఘా నీడలోకి తెచ్చారు.
దక్షిణాదిలోని అమెరికా, ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయాలపై దాడికి వ్యూహ రచన చేశారని, ఈ కార్యాలయాలకు వెళ్లే మార్గాలు, ఆయా ప్రాంతాల మ్యాప్‌లు పాకిస్తాన్‌కు చేరి ఉన్నట్టుగా అతడి వద్ద జరిపిన విచారణలో వెలుగు చూసింది. శ్రీలంకలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెబ్ సైట్ ద్వారా అమెరికా, ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయాలకు చెందిన పూర్తి వివరాలు సేకరించినట్టు, జాకీర్ పోలీసులకు వెల్లడించారని సమాచారం. దీంతో చెన్నై రాధాకృష్ణన్ సాలైలోని అమెరికా, నుంగంబాక్కంలోని శ్రీలంక, బ్రిటీషు దౌత్య కార్యాలయాలకు భద్రతను పెంచారు. అమెరికా దౌత్య కార్యాలయానికి ఆరంచెల భద్రతను కల్పించి ఉన్నా రు. ఇప్పటికే అక్కడ భద్రత కట్టుదిట్టం గా ఉన్నా, ఆ పరిసరాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ కాని రీతిలో గట్టి చర్యలు తీసుకుని ఉన్నారు.
నిర్లక్ష్యానికి మూల్యం: రాష్ట్రం మీద తీవ్రవాదుల గురి ఉందంటూ పదే పదే కేంద్రం హెచ్చరిస్తూ వచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తాజాగా పేలుడు చోటుచేసుకుందని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గువాహటి పేలుడులో గాయపడి జీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు ఉదయం స్టాలిన్ పరామర్శించారు. బాధితలకు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రం శాంతి వనంగా ఉందని గొప్పలు చెప్పుకుం టూ, నేరగాళ్లకు , సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్యం కారణంగా పేలుడు చోటు చేసుకుందని శివాలెత్తారు. ఈ పేలుడుకు ముందు రోజే కేంద్రం తీవ్ర హెచ్చరించినా, అప్రమత్తం కాకపోవడం బట్టి చూస్తే, ఏ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టం అవుతోందని విమర్శించారు.
ముగ్గురి ‘చెవి’కి దెబ్బ: పేలుడులో గాయపడ్డ ముగ్గురు వినికిడి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పేలుడు శబ్ధం దాడికి ఆ ముగ్గురి చెవుల్లో కర్ణబేరి దెబ్బతింది. దీంతో వీరికి ఈఎన్‌టీ ైవె ద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వినికిడి అనుమానమేనని పేర్కొంటున్నారు. గాయపడ్డ ఆరుగురి శరీరాల్లో పాస్పరస్ రసాయనాలు ఉన్నాయి. శరీర గాయాలకు చికిత్సతో పాటుగా పాస్పరస్‌ను తొలగించే పనిలో వైద్యులు నిమగ్నమయ్యూరు. అయితే, దీని వలన ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.