
పింఛన్‌కూ లంచం..
► నిజామాబాద్ జిల్లాలో సీబీఐకి చిక్కిన పోస్టుమాస్టర్ బాసిత్
► పింఛన్‌దారుల నుంచి వెయ్యి లంచం డిమాండ్
► సీబీఐకి ఫిర్యాదు చేసిన బీడీ కార్మికురాలు
► కొండూరు పోస్టాఫీసుపై సీబీఐ దాడి
► లంచం తీసుకుంటూ పట్టుబడిన పోస్టుమాస్టర్
సాక్షి, హైదరాబాద్/సిరికొండ (నిజామాబాద్ రూరల్) : ఆమె ఒక బీడీ కార్మికురాలు.. ప్రతీ నెల ప్రభుత్వం నుంచి ఆమెకు వచ్చేది రూ.1000 పింఛన్ మాత్రమే. ఆ పైసలే ఆధారంగా జీవిస్తున్న ఆమెకు రెండు నెలలుగా పింఛన్ అందడం లేదు. దీంతో తనకు పింఛన్ రావడం లేదని పోస్టుమాస్టర్‌ను అడిగింది. దీనికి అతను తనకు రూ.వెయ్యి లంచం ఇస్తే నీకు పింఛన్ వస్తుందని చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆ కార్మికురాలు సీబీఐని ఆశ్ర యించింది. రంగంలోకి దిగిన సీబీఐ సదరు పోస్ట్‌మాస్టర్‌ను అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామానికి చెందిన గర్గుల భారతి బీడీ కార్మికురాలు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వచ్చే పింఛన్ 2 నెలల నుంచి ఆమెకు రావడం లేదు. పింఛన్ కోసం కొండూర్ గ్రామ పోస్టుఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. చివరికి బ్రాంచ్ పోస్టుమాస్టర్(బీపీఎం) బాసిత్‌ను తనకు రావాల్సిన పింఛన్ ఎందుకు రావడం లేదని అడిగింది. తనకు రూ.వెయ్యి లంచం ఇస్తే రెండు నెలల పింఛన్ ఇస్తానని అతను చెప్పాడు. గ్రామపంచాయతీ దగ్గర కానీ, తన ఇంటి వద్దకు గానీ రూ.వెయ్యి తెచ్చి ఇస్తే రూ. రెండు వేల పింఛన్ ఇస్తానని చెప్పాడు. రూ. వెయ్యి లంచం ఇవ్వకపోతే పింఛన్‌ఎప్పటికీ రాదని బెదిరించాడు.
సీబీఐ అధికారులకు సమాచారం..
దీంతో భారతి భర్త రాములు తొలుత ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోస్టాఫీసు కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక వాటిపై దాడిచేసే అధికారం తమకు లేదని వారు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. బాసిత్ ఫోన్లో డబ్బులు డిమాండ్ చేసిన విషయాన్ని రికార్డు చేశారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా సీబీఐ అధికారులను రాములు సంప్రదిస్తూ ఉన్నాడు. బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు తన ఇంట్లో భారతి నుంచి బాసిత్ రూ.వెయ్యి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడే విచారణ చేపట్టారు. సీబీఐ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు నరేష్, నందం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల తర్వాత తపాలాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం ఆరు గంటల వరకు.. బాసిత్ ఇంట్లోనే ఉండి అధికారులు విచారణ చేశారు. అనంతరం బాసిత్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు.
గతంలోనూ డబ్బులు తీసుకున్నాడు: భారతి
బాసిత్ నాలుగు రోజుల నుంచి ఫోన్ చేసి లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని, గతంలోనూ పలుమార్లు ఫించన్ ఇచ్చేప్పుడు డబ్బులు తీసుకున్నాడని భారతి ఆరోపించారు. తన వద్దే కాకుండా గ్రామంలో పలువురి వద్ద నుంచీ డబ్బులు తీసుకునే వాడన్నారు.