కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వార్తల్లోకి ఎక్కారు. అవినీతి మరక ఆయన మీద పడడంతో రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. కాంగ్రెస్‌లోని కొన్ని గ్రూపులు
సాక్షి, చెన్నై : కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వార్తల్లోకి ఎక్కారు. అవినీతి మరక ఆయన మీద పడడంతో రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. కాంగ్రెస్‌లోని కొన్ని గ్రూపులు లోలోపల ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం రాష్ట్రంలో చూసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నా, తెర వెనుక నుంచి రాజకీయం సాగిస్తూ వచ్చిన కార్తీ చిదంబరం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగారు. తన తండ్రి చిదంబరం నియోజకవర్గం శివగంగై నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పనిలో పడ్డారు.
చిదంబరం మద్దతు వర్గానికి అండగా ఉంటూ, కాంగ్రెస్‌లోని గ్రూపుల్లో అతి పెద్ద గ్రూపుగా చిదంబరం వర్గాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా కార్తీ చిదంబరం మీద అవినీతి మరక పడడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి మరక: రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో అవినీతి చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతం బిజేపి ప్రభుత్వం గుర్తించింది. సీబీఐను రంగంలోకి దించడంతో అక్కడి మాజీ ముఖ్యమంత్రితో పాటుగా పలువురి మీద ఆరోపణలు బయలు దేరాయి. కేసుల నమోదు ప్రక్రియ సాగుతున్నది.
ఈ అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న సమాచారంతో వెలుగులోకి రావడం, ఆ మరక ఆయన మీద పడ్డట్టు అయింది. దీంతో కార్తీ చిదంబరం మీద పడ్డ అవినీతి మరక చర్చ కాంగ్రెస్‌లోనే కాదు, రాష్ర్టంలోనూ సాగుతున్నది. తండ్రి చేతిలో ఉన్న ఆధికారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని కార్తీ మరెన్న వ్యవహారాలు సాగించి ఉంటారన్న ఆరోపణలు బయలు దేరాయి. కాంగ్రెస్‌లోని కొన్ని గ్రూపులు ఈ వ్యవహారాన్ని ఆసరగా తీసుకుని రాజకీయం సాగించేందుకు సిద్ధం అయ్యాయి. అయితే, కార్తీ చిదంబరంకు ఎలాంటి సంబంధం లేదని, చిదంబరం మీద కక్ష సాధింపు లక్ష్యంగా కార్తీ చిదంబరం మీద అవినీతి మరకను అంటించి ఉన్నారని ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు.
నాకే సంబంధం లేదు: తన మీద 108 సేవల అవినీతి మరకను రాజస్థాన్ ప్రభుత్వం రుద్దుతుండడంపై కార్తీ చిదంబరం స్పందించారు. ఓ మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలో తాను ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా మాత్రం గతంలో పనిచేశానని, ఆ సమయాల్లో సంస్థ వ్యవహారాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, జోక్యం చేసుకునే అవకాశం కూడా తనకు రాలేదన్నారు. అలాంటప్పుడు తనను ఇరికించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ సంస్థలో తాను వాటా దారుడు కూడా కాదు అని కేవలం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా మాత్రమే పనిచేశానని తెలిపారు. సంబంధం లేని వ్యవహారాన్ని తన మీద రుద్దే యత్నం మానుకోవాలని హితవు పలికారు.