లోకాయుక్త కేసు సీబీఐకి? | CBI taken to Lokayukta case ? | Sakshi
Sakshi News home page

లోకాయుక్త కేసు సీబీఐకి?

Published Thu, Jul 2 2015 1:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

లోకాయుక్త కేసు సీబీఐకి? - Sakshi

లోకాయుక్త కేసు సీబీఐకి?

న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం
లోకాయుక్త న్యాయమూర్తి రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్

 
బెంగళూరు: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా లోకాయుక్త స్థానంలో ఉన్న వ్యక్తిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకుగాను ప్రత్యేక విచారణ బృందాన్ని(ఎస్‌ఐటీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌ఐటీ విచారణ పారదర్శకంగా సాగే అవకాశాలు కనిపించడం లేదని, అందువల్ల ఈ అంశంలో నిజానిజాలు వెల్లడి కావాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక ఇదే విషయంపై అసెంబ్లీలో విపక్షాలు తమను నిలదీసేందుకు వ్యూహం రచిస్తున్నాయని తెలుసుకున్న ప్రభుత్వం విపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగా తనే నిర్ణయం తీసుకోవాలనే దిశగా పావులు కదుపుతోంది. ఇక ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిస్తున్నాయి. బెళగావిలోని సువర్ణసౌధ వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై స్పందిస్తూ, ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. లోకాయుక్త ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో తాము వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతున్నామని సిద్ధరామయ్య తెలిపారు. ఇక  ఇదే అంశంపై ప్రతిపక్షం జేడీఎస్ శాసనసభలో అధికార పక్షాన్ని నిలదీసింది. జేడీఎస్ శాసనసభ్యులు వై.వి.దత్తా మాట్లాడుతూ, ‘ఏడీజీపీ కమల్‌పంత్ మూడు నెలల విదేశీ పర్యటనకు వెళుతున్నారు. అలాంటి సందర్భంలో ఆయన నేతృత్వంలో ఎస్‌ఐటీని ఏర్పాటు చేయడంపై ప్రభుత్వ వైఖరిని ఎలా అంచనా వేయాలి?’ అని ప్రశ్నించారు.

లోకాయుక్త రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్
 ఇక లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు రాజీనామా చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని న్యాయవాదులు లోకాయుక్త భాస్కర్‌రావు రాజీనామా చేయాల్సిందేనంటూ ధర్నాలకు దిగుతున్నారు. న్యాయవాదుల సంఘంతోపాటు మరికొన్ని ప్రజాసంఘాల కార్యకర్తలు బుధవారమిక్కడి ఎం.ఎస్.బిల్డింగ్‌లోని లోకాయుక్త కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదుల పరిషత్ అధ్యక్షుడు పి.పి.హెగ్డే మాట్లాడుతూ, లోకాయుక్త కార్యాలయంతోపాటు ఆయన నివాసంలో సైతం ఎంతో మంది అధికారులను బెదిరించి లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కుమారుడితో కలిసి కోట్ల రూపాయల డీలింగ్‌లకు పాల్పడ్డ వై.భాస్కర్‌రావు ఆ పదవిలో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కారని విమర్శించారు. ఇక పెద్ద సంఖ్యలో లోకాయుక్త కార్యాలయానికి చేరుకున్న న్యాయవాదులు లోకాయుక్త కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయవాదులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోకాయుక్త కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement