- రైతుల ఆత్మహత్యలపై బీజేపీపై సేన ఫైర్
- వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శ
- ప్రభుత్వం మెడలు వంచి వాగ్దానాలు తీరుస్తామని స్పష్టం
ముంబై: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై మిత్రపక్షం బీజేపీని శివసేన తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వం ట్రూత్ అండ్ లై ఆట ఆడుతోందని విమర్శించింది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు సీఎం ఫడ్నవీస్ కేంద్రాన్ని సహాయం కోరాడా అని ప్రశ్నించింది. రాజ్యసభలో శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ రైతుల ఆత్మహత్యలపై ప్రశ్న లేవనెత్తారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల నష్ట పోయిన రైతులకు సాయం చేయాల్సిందిగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కేంద్రాన్ని కోరారని ఆయన అన్నారు. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌గారి సమాధానం ఆమోదయోగ్యంగా లేదని అన్నారు.
మహారాష్ట్ర సీఎం ఏవిధమైన సహాయాన్ని కోరలేదని మంత్రి రాధా మోహన్ అంటున్నారని, ఇది నిజం కాదని అన్నారు. రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు అని విమర్శించారు. మరోవైపు ఇద్దరు మంత్రులు ఎవరికి వారు అవతలి వారు అబద్ధం చెబుతున్నారంటున్నారని, మరి నిజం ఏంటని శివసేన పత్రిక ‘సామ్నా’లో ప్రశ్నించింది. విపత్తు సంభవించిన వెంటనే ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించిందని, అయితే సహాయం బాధిత రైతులకు అందిందా అని నిలదీసింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ వారు ఏం చేసినా చూస్తూ ఊరుకోం అని చెప్పింది. అవసరమైనప్పుడు ప్రజల తరఫున మాట్లాడతామని స్పష్టం చేసింది. ప్రభుత్వం మెడలు వంచైనా రైతుల వాగ్దానాలు తీరుస్తామని తేల్చి చెప్పింది.
కేంద్ర ‘ట్రూత్ అండ్ లై’ ఆటాడుతోంది
Published Tue, May 12 2015 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement