‘ఆప్’ లెక్కలు చూడండి
Published Wed, Oct 23 2013 11:14 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆర్థిక వ్యవహారాలను తనిఖీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదే శాలు జారీచేసింది. ఆ పార్టీకి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి.. ఎలా ఖర్చు పెడుతున్నారు.. జమాఖర్చులను నిర్వహిస్తున్నారా లేదా.. నిబంధనలను పాటిస్తున్నారాఅనే విషయాలను పరిశీలించాలని తన మార్గదర్శకాలలో పేర్కొంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విదేశాలనుంచి నిధులను సేకరిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ సభ్యులు జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, వీకే రావ్ మాట్లాడుతూ.. ‘ ఆప్‌కు చెందిన ఖాతాలను మరోసారి పరిశీలించండి.. ఒకవేళ వారు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-2010 ని అధిగమించినట్లయితే తగిన చర్యలు తీసుకోండి.. లేదా కోర్టుకు తెలియజేయండి..’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత ్వం తరఫు న్యాయవాది రిచా కపూర్ ఈ విషయమై బుధవారం కోర్టుకు నివేదిక అందజేశారు. 2012లో అన్నాహజారే నాయకత్వంలోని పౌరసమాజానికి సంబంధించి జమాఖర్చులను మదింపు చేశామని అందులో పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఆప్ ప్రారంభం నుంచి దాతలు ఇచ్చిన నిధుల వివరాలను సైతం నివేదించాలని ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది.
ఆప్‌కు వాల్మీకి సమాజం మద్దతు
వాల్మీకి సమాజం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలికింది. ఆ సమాజానికి చెందిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆప్ ఇచ్చిన ఎన్నికల హామీని నమ్మి తాము వారికి మద్దతు తెలుపుతున్నట్లు ఆ సమాజం పెద్దలు బుధవారం తెలిపారు. ‘వాల్మీకి సమాజానికి చెందిన చాలామంది 60 ఏళ్లుగా నగరంలో కాంట్రాక్ట్ పద్ధతిన పలు విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు సుమారు రూ. 10 వేలు సంపాదిస్తున్నట్లు సంతకాలు పెట్టి కేవలం రూ.3 వేల నుంచి 4 వేల వరకు మాత్రమే పొందుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మమ్నల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ సారి ఆప్‌కు మద్దతు పలికి మా సత్తా ఏమిటో చూపిస్తాం..’ అని వాల్మీకి కులస్తుల నాయకుడు మహీంద్ర సింగ్ మాటియాలా అన్నారు. ఆయన 30 ఏళ్లుగా బీజేపీలో చురుకుగా పనిచేస్తున్నారు. ఇటీవల వందలాదిమంది తన సమాజం వారితో ఆప్‌లో చేరారు.
Advertisement