
మండలిలో వాగ్వాదం.. ఉద్రిక్తత
ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టలేమని శాసనమండలి విపక్ష నేత సీ. రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మొదటినుంచీ ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెబుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లుగా ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ కాదని.. అది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉన్నా.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
రామచంద్రయ్య వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాను ప్రధానితో సఖ్యతగా ఉన్నానని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటే.. కేంద్రానికి.. లేదా మీకే ఇచ్చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అధికార, విపక్ష నేతల వాగ్వాదంతో శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వలనే ప్రత్యేకహోదా రాలేదంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో శాసన మండలిలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంలోనే రామచంద్రయ్యపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనను ఏకవచనంతో సంబోధిస్తూ, ''20 ఏళ్లు కలిసి పనిచేశాం, నువ్వేంటో నాకు తెలియదా... మీరు అలా చేయబట్టే 2 శాతం ఓట్లు వచ్చాయి.. ఇక కూర్చో'' అంటూ వ్యాఖ్యానించారు. దాంతో రామచంద్రయ్య కూడా ఆగ్రహానికి గురయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత విపక్ష సభ్యులకు దానిపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కూడా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమాత్రం దానికి ఇక్కడ కూర్చోబెట్టి వినిపించడం ఎందుకు, ప్రకటన ప్రతి ఇస్తే ఇళ్లకు వెళ్లి చదువుకునేవాళ్లం కదా అని అన్నారు.