తక్కువ ధరకే టిఫిన్, భోజనాల అమ్మకాలతో ఆకట్టుకున్న అమ్మ క్యాంటిన్‌లో త్వరలో చపాతీ ప్రవేశించనుంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)లో వినియోగదారుల సౌకర్యార్థం చపాతీ సేవలు వినియోగంలోకి రానున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
పేద, బడుగు తరగతి ప్రజలకు చేరువకావడమే లక్ష్యంగా సాగుతున్న అమ్మ పాలనలో అనేక పథకాలు అమలులోకి వచ్చాయి. వీటిల్లో అమ్మ క్యాంటిన్ల పథకం ఎంతో ఆకట్టుకుంది. ఒక్క రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకు సాంబార్ అన్నం, పెరుగన్నం అందిస్తున్నారు. నగరంలోని 200 వార్డుల్లోనూ అమ్మక్యాంటిన్లు వెలిశాయి. వైద్య చికిత్సల కోసం రాష్ట్రం నలుమూలల నుంచేకాక, పొరుగురాష్ట్రాల నుంచి వచ్చేరోగులతో కిటకిటలాడే జీహెచ్‌లో సైతం అమ్మ క్యాంటిన్ వెలిసింది. గత నెల 20వ తేదీన సీఎం జయలలిత ప్రారంభించారు. జీహెచ్‌లోని రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది, ఆటో కార్మికులకు అమ్మ క్యాంటిన్ వసతిగా మారింది.
గత 15 రోజుల్లో 75 వేల ఇడ్లీ, 13 వేల పొంగల్, 13 వేల సాంబారన్నం, 8 వేల పెరుగున్నం అమ్మకాలు సాగాయి. రోజూ పెద్ద సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసు బందోబస్తు అనివార్యమైంది. ప్రస్తుతం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మాత్రమే అందుతోంది. రాత్రి వేళల్లో అందుబాటులో హోటళ్లులేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలో రాత్రి వేళల్లో కేవలం రూ3లకు చపాతి, దాల్, కుర్మా అమ్మకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ క్యాంటిన్‌లో ఏర్పాట్లు ప్రారంభమైనాయి. మరో పదిరోజుల్లో చపాతీ అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉందని చెన్నై కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి.
అమ్మ క్యాంటిన్‌లో చపాతి
Published Sat, Dec 7 2013 3:04 AM | Last Updated on Mon, May 28 2018 4:09 PM
Advertisement