జయతో ఢీఎంకే
చెన్నై, సాక్షి ప్రతినిధి:పేద కూలీలను పొట్టనపెట్టుకున్న అపార్ట్‌మెంటు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం జయలలితను డిమాండ్ చేస్తూ శనివారం డీఎంకే నగరంలో భారీ ర్యాలీ చేపట్టింది. ఇదే డిమాండ్‌పై గవర్నర్ కే రోశయ్యకు వినతి పత్రం సమర్పించింది. అపార్ట్‌మెంటు కూలిన సంఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మరో అంశానికి తావులేకుండా ఘోషిస్తున్నా యి. న్యాయవిచారణ జరుగుతోందన్న సాకు తో చర్చకు తావివ్వడం లేదని ధ్వజమెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాయి. ఈ విషయంలో అన్నాడీఎంకే మిన హా అన్ని పార్టీలు ముక్తకంఠంతో సీబీఐ విచారణ కోరుతున్నాయి.
అయితే అసెంబ్లీలో ప్రతిపక్షాల వాదనకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని డీఎంకే నిర్ణయించుకుంది. అయితే రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నై ఎగ్మూరులో ఉన్న మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) కార్యాయం సమీపం నుంచి రాజరత్నం స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు పాల్గొని జయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డుతో ర్యాలీలో వెళ్లారు. 10.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ 11. 45 గంటలకు రాజరత్నం స్టేడియంకు చేరుకోగానే స్టాలిన్ సహా పలువురు ముఖ్యనేతలు కారులో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ,
నిబంధనలకు సీఎండీఏ పాతర వేయడమే ప్రమాదానికి ప్రధాన కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయని అన్నారు. అయితే ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతూ తమ ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని వాదిస్తోందని చెప్పారు. కంటి తుడుపు చర్యగా ఏక సభ్య కమిషన్‌ను నియమించి వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం సాగిస్తోందని విమర్శించారు. అందుకే తాము సీబీఐ విచారణకు పట్టుపడుతున్నామని అన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో వాస్తవాలు వెలుగు చూసేవరకు డీఎంకే పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.