నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీం డైరీల్లో ఉన్న లోగుట్టును ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నయీమ్ డైరీల వెనుక ఉన్న వ్యక్తుల పేర్లను బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
దొరికిన ఆధారాలను దాచుకోకుండా వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని, డైరీలను పరిశీలించేటప్పుడు వీడియో కెమెరాలు వాడాలన్నారు. సిట్ అనే సంస్థ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని, ఎప్పుడు ఎవరిమీద లీకులు పేపర్లకు అందుతాయో అర్థం కావడం లేదన్నారు. సొహ్రాబుద్దీన్, కోనపురి రాములు, బెల్లి లలిత, బాబర్‌ఖాన్ లాంటి వాళ్లను నిర్ధాక్షిణ్యంగా హతమార్చిన నేరస్తుడి వివరాలను ప్రజలకు అందకుండా దాచిపెట్టడం వెనుకఉన్న కారణం ఏంటో ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు. లీకుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్, బీసీ సంక్షేమం కోసం పోరాడుతున్న ఆర్. కృష్ణయ్య పేర్లుండటం వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు వినిపిస్తున్నాయని, కాబట్టి వెంటనే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి ప్రజా న్యాయస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఆర్. కృష్ణయ్య లాంటి వాళ్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరకపోవడంతో కక్ష కట్టి కేసును బనాయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సిట్ నిర్వహిస్తున్న విచారణపై అనుమానాలు ఉన్నందున కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ విషయంపై ఆందోళన చేపట్టనున్నామని సుధాకర్ చెప్పారు.
‘నయీం డైరీల్లో ఉన్న లోగుట్టును బయటపెట్టాలి’
Published Sat, Sep 17 2016 7:25 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement