రూ.1.4 లక్షల కోట్లు ఎక్కడ ?
మాజీ మంత్రి చిదంబరం
టీనగర్ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర మునుపెన్నడూ లేనంతగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వానికి లభించిన రూ.1.4 లక్షల కోట్లు ఏమయ్యాయని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. చెన్నై లయోలా కళాశాలలో జరిగిన వాణిజ్య సదస్సులో చిదంబరం ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 109 అమెరికా డాలర్లుగా ఉందని, ప్రస్తుతం 30 డాలర్లుగా మునుపెన్నడూ లేనంతగా పతనమైందన్నారు.
దీంతో సుమారు 40 బిలియన్ అమెరికా డాలర్లను కేంద్ర ప్రభుత్వం పొదుపు చేసిందన్నారు. పన్నుల శాతం, ప్రైవేటు షేర్లు పోగా రూ.1.4 లక్షల కోట్ల రూపాయలు ప్రధాని మోదీ ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నారు. ఈ నగదు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. వ్యవసాయం, రైల్వే వంటి పలు శాఖలకు ఈ నగదును సరైన రీతిలో ఖర్చు చేసివుండొచ్చన్నారు.
కాంగ్రెస్ పాలనలో కూడా కూటమి పార్టీల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే బడ్జెట్ నివేదికను రూపొందించేవారమన్నారు. మైనారిటీ ప్రభుత్వపు ఆర్థిక శాఖా మంత్రిగా వున్న తాను కొన్ని సామరస్యపూర్వక ప్రతిపాదనల తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టానన్నారు. 30 ఏళ్ల తర్వాత ప్రత్యేక మెజారిటీతో రూపొందిన మోదీ ప్రభుత్వం ఎటువంటి సామరస్యానికి చోటివ్వకుండా బడ్జెట్ రూపకల్పన చేసివుండొచ్చన్నారు.
భారత దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా కొన్నేళ్లలో పోలిస్తే వరుసగా 14 నెలలపాటు ఎగుమతులు తక్కువగా ఉన్నాయన్నారు. అనేక మంది ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయని, గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.