
ఇలాగైతే ఎలా..?
శాసన మండలి సమావేశాలకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడాన్ని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు.
► సమావేశాలకు హాజరుకాని అమాత్యులపై సీఎం ఫైర్
► ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెప్పాలి ?
► సమావేశాలు ముగిసేవరకు విధిగా హాజరు కావాల్సిందే
► రుణమాఫీ అసాధ్యం
సాక్షి, బెంగళూరు: శాసన మండలి సమావేశాలకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడాన్ని ప్రశ్నిస్తూ గురువారం ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో సమావేశాలకు హాజరుకాని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విధానసౌధలోని సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరుకాక పోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఆయా శాఖల మంత్రులు సమావేశాలకు గైర్హాజరు కావడంతో ఆయా శాఖలకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు గైర్హాజరు కావడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంవహిస్తున్నారనే ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరుతుందన్నారు. తద్వారా ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీచే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సోమవారం నుంచి సమావేశాలు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలంటూ ఆదేశించారు.
రుణమాఫీ సాధ్యం కాదు....
ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని రాష్ట్ర వ్యాప్తంగా 22 శాతం మంది రైతులు సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకోగా 78 శాతం మంది రైతులు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయడానికి ముందకు వస్తే సహకార బ్యాంకుల్లో రైతుల రుణాలు మాఫీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నమని తెలిపారు. పదే పదే రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడుతుందని దీని వల్ల సహకార రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
రుణమాఫీ ప్రకటిస్తే సహకార బ్యాంకులకు రూ.11 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని దీనివల్ల ప్రభుత్వం దివాళా తీసే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి వాస్తవిక పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప పదే పదే రుణాలు మాఫీ చేయాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తామంటూ సాధ్యతరం కాని అబద్దపు హామీలతో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.