
అట్టహాసంగా ‘సర్వోదయ’
వంద హామీలు నెరవేర్చామన్న సీఎం
తన పాలనపై శ్వేతపత్రం
విడుదలకు సిద్ధమంటూ ప్రకటన
బెంగళూరు: రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి రెం డేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సర్వోదయ’ పేరుతో అట్టహా సంగా సమావేశాన్ని నిర్వహించారు. దావణగెరెలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, కర్ణాటకను కాంగ్రెస్ రహిత రాష్ట్రం గా మార్చాలని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, అయితే అది ఎన్నటికీ సాధ్యం కాదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, కాంగ్రెస్ కార్యకర్తల అండదండలతో కర్ణాటకను ‘బీజేపీ రహిత’ రాష్ట్రంగా మారుస్తానని అన్నారు. ‘పేదల ఆకలి తీర్చేందుకు మేము ఉచితంగా బియ్యం అందిస్తుంటే, ఇక ప్రజలు కూలి పను లకు ఏం వెళతారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మొత్తం 13 మంది జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
అలాంటి బీజేపీ నేతలు ఇప్పుడు తమపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోందని, అయినా ఇప్పటికీ ప్రజలకు మేలు కలిగించే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని విమర్శించారు. అదే తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యే సరికి మేనిఫెస్టోలోని 160 హామీల్లో 100 హామీలను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం తాము ఏం చేశామనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధమని, అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయగలదా అని సిద్ధరామయ్య సవాల్ విసరడం గమనార్హం.