ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై న్యాయపోరాటానికి దిగేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
హైకమాండ్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూపులు
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై న్యాయపోరాటానికి దిగేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్కావతి లే అవుట్‌లో భూముల డీనోటిఫికేషన్ అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరకాటంలోకి నెట్టేందుకు గాను బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సిద్ధుతో పాటు భూ అవినీతి ఆక్రమణలను ఎదుర్కొంటున్న ఆయన మంత్రి వర్గ సహచరులపై సైతం న్యాయపరమైన పోరాటానికి బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల ముందుకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో తమపై కాంగ్రెస్ నేతలు ఏ అస్త్రాన్నైతే ప్రయోగించారో అదే అస్త్రాన్ని తిరిగి కాంగ్రెస్‌పై ప్రయోగించేందుకు బీజేపీ నేతలు కార్యాచరణను రూపొందిస్తున్నారు. గురువారం నగరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఇందుకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. ‘కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయి.
అంతేకాదు ముఖ్యమంత్రితో పాటు మంత్రి మండలిలోని అనేక మంది మంత్రులు భూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మనం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకు న్యాయపరమైన పోరాటాన్ని కూడా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలో అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి’ అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సారధిపైనే న్యాయపరమైన పోరాటానికి బీజేపీ రాష్ట్రశాఖ నేతలు సన్నద్ధమయ్యారు. ఇక ఇందుకుగాను బీజేపీ హైకమాండ్ నేతల ఆదేశాల కోసం రాష్ట్ర శాఖ నేతలు ఎదురుచూస్తున్నారు. ఈనెల చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో స్వయంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.