'బీజేపీ మంత్రులంతా అసమర్థులు'
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్య
సదానంద అసమర్థత వల్లే అప్రధాన్య శాఖ
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులంతా అసమర్థులేనని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా బుధవారమిక్కడి విధానసౌధ ఎదుట ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రనికి చెందిన సదానందగౌడకు అప్రధాన్యమైన శాఖను కేటాయించడంపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘సదానందగౌడ అసమర్థత కారణంగానే న్యాయశాఖ వంటి ప్రధానమైన శాఖ నుంచి ఆయనకు అప్రధానమైన ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ శాఖను కేటాయించారు. సదానందగౌడ మాత్రమే కాదు బీజేపీలోని మంత్రులంతా అసమర్థులుగానే తయారయ్యారు’ అని విమర్శించారు. ఇక మైసూరు జిల్లా కలెక్టర్ శిఖాను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య వెల్లడించారు. ‘తనను కొంతమంది వ్యక్తులు బెదిరించిన విషయంపై కలెక్టర్ శిఖా ఇప్పటికే కేసు దాఖలు చేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
జేడీఎస్‌తో మైత్రి లేదు.....
శాసనమండలి సభాధిపతి ఎంపిక విషయమై ఇప్పటి వరకు జేడీఎస్‌తో చర్చించలేదని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేపీసీసీ వర్కింగ్ ప్రసిడెంగ్ దినేష్ గుండూరావ్, ఎంపీ చంద్రప్ప, మంత్రులు ఆంజనేయ, హెచ్.సి.మహదేవప్ప తదితరులు పాల్గొన్నారు.