ఆమ్‌ఆద్మీ పార్టీలో సామాన్యులెందరు?
Published Thu, Dec 12 2013 11:14 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: అవినీతిలేని పాలన, డబ్బు ప్రభావం లేని ఎన్నికలు తమ లక్ష్యంగా ప్రకటించి సామాన్య ప్రజల కోసమే తమ పార్టీ అంటూ అరవింద్ కేజ్రీవాల్ భారీ ప్రచారమే చేశాడు. పాలక, ప్రతిపక్ష నేతల అవినీతి, బంధు ప్రీతి, ధనదాహాలతో విసిగిన ప్రజలు కేజ్రీవాల్ మాటలు నమ్మి ఓటు వేసి అధికారానికి అందేంత దూరం తీసుకొచ్చారు. అనూహ్య ప్రజాదరణ ఫలితంగా ఆమ్‌ఆద్మీ పార్టీలో 28 మంది ఎమ్మెల్యేలు విజయబావుటా ఎగురవేశారు. అయితే వీరిలో సామాన్యులు, సగటు మనుషులు ఎందరని పరిశీలిస్తే సగానికి సగం కోటిశ్వరులే అని తేలింది. నిన్న మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల పట్టికల వివరాల ప్రకారమే 12 మంది కోటీశ్వరులు. కాంగ్రెస్ నాయకుడు రాజేశ్ లిలోతియాను పటేల్‌నగర్ స్థానంలో ఓటమిపాలు చేసిన వీణా ఆనంద్ ఆస్తులు 15.52 కోట్ల రూపాయలని వెల్లడైంది.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 14.25 కోట్లు కాగా బీజేపీ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ. 8.16 కోట్లు, ఇక ఇదే ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటును లెక్కిస్తే 2.51 కోట్ల రూపాయలని తేలింది. గెలుపొందిన వారిలో నాలుగింట మూడొంతుల మంది ఢిల్లీలో కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వారే అని ఏడీఆర్ విశ్లేషణ తేల్చింది.ఇక కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిలో సగానికి ఎక్కువ మంది కోటీశ్వరులు బీజేపీ పక్షానికి చెందిన వారు కాగా మిగతా వారు కాంగ్రెస్ మరియు ఆప్ పార్టీలకు చెందినవారు. ఎక్కువ మంది ఆస్తులు స్థిరాస్తుల రూపంలోనే ఉన్నాయని తేలింది.
ఇక బీజేపీ, ఆప్‌లకు చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థులు డాక్టర్ హర్షవర్ధన్, అరవింద్ కేజ్రీవాల్‌లు కోటీశ్వరులైన ఎమ్మెల్యేల లెక్కలోనే చేరారు. ఆప్ తరఫున ఎన్నికయివారిలో 10 మంది ఆస్తులు మాత్రం అతి సాధారణంగా ఉన్నాయి. వీరు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాల ప్రకారం సీమాపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ధర్మేందర్‌సింగ్ కోలి ఆస్తుల విలువ 20,800 రూపాయలని, మంగోల్‌పురి నియోజకవర్గం నుంచి గెలిచిన రాఖీ బిర్లా ఆస్తుల విలువ రూ.51,150లని తేలింది. మోడల్ టౌన్ అభ్యర్థి అఖిలేష్పతి త్రిపాఠీ ఆస్తులు రూ. 1.59 లక్షలుగా ప్రకటించారు.ఇక మొత్తం ఢిల్లీ ఎమ్మెల్యేల్లో అతి శ్రీమంతుడు మంజీందర్ సింగ్ సిర్సా. ఈయన శిరోమణి అకాలీదళ్ పార్టీ అభ్యర్థి రాజోరీగార్డెన్ నుంచి గెలిచిన ఈయన ఆస్తుల విలువ రూ.235.51 కోట్లని తేలింది.
Advertisement
Advertisement