కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనం
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని, విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసే ప్రణాళికతో ముందుకెళ్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్‌లో టీఎస్టీఎఫ్ క్యాలండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని, బడ్జెట్‌లో విద్యకు తక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్‌కు గండి కొట్టి విద్యార్థులకు చదువును దూరం చేస్తున్నదని, యూనివర్సిటీలలో సైతం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నదని చెప్పారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. కేసీఆర్ రాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ వచ్చే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం డీఎస్సీ వేయకుండా బిఎడ్, డీఎడ్ కాలేజీలను మూసివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.