ఫస్టాఫ్‌లో మోదీ.. సెకండాఫ్‌లో రాహుల్
Published Sat, Mar 18 2017 3:54 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM
హైదరాబాద్: ‘సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ అంతా విలన్ దే పై చేయిగా ఉన్నట్టు కనిపిస్తుంది.. సెకండాఫ్‌లో హీరోదే అంతిమ విజయం.. రాజకీయాల్లోనూ అంతే’ అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అని వ్యాఖ్యానించారు. ‘మోడీ ఫస్ట్ ఆఫ్ నడుస్తోంది, సెకండాఫ్‌లో మా రాహుల్ దే విజయం.. రామాయణ.. మహాభారతాల్లోనూ అదే జరిగిందన్నారు. అడవులకు వెళ్ళిన పాండవులు తర్వాత ఏం చేశారో అందరికీ తెలిసిందే’నని చెప్పారు. కాంగ్రెస్ 40 ఏళ్ల క్రితమే బర్రెలు, గొర్రెల పథకం అమలు చేసింది.. కేసీఆర్ ఇప్పుడే చేస్తున్నట్టు చెబుతున్నారని గుర్తు చేశారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు కేసీఆర్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీలు కాగా వీటిలో అమలైనవి జీరో అని విమర్శించారు.
ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ధనిక రాష్ట్రాన్ని మూడేళ్లలో అప్పులపాలు చేశారని ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ చట్టబద్ధ సంస్థ కాదా అని ప్రశ్నించారు. అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు పోవడం నేరమా అని నిలదీశారు. కోర్టులు ఇచ్చే తీర్పులు అన్యాయమైనవా? తెలంగాణలో కోర్టులు కూడా ఉండొద్దంటారేమో! అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థలు చేయాల్సిన పనులు ఆ వ్యవస్థలు చేస్తాయి. అయితే, ఏ వ్యవస్థలు పని చేయొద్దు...తానొక్కడినే పని చేస్తానని కేసీఆర్ అనుకుంటే ఎలాగని ప్రశ్నించారు.
Advertisement
Advertisement