ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పురోభివృధ్ధికి చేయూతనివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు సహకరించాలని, కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధు ల విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, వైద్య, విద్యరంగాలను మరింత బలోపేతం చేసేందుకు తోడ్పాటునివ్వాలని, రాష్ట్రంలో ఇప్పటికే అమలవు తున్న పథకాలు, చేపట్టిన వివిధ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని విన్న వించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీ య హోదా ఇవ్వాలని కోరారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు తొలిసారిగా ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీ సందర్భంగా ఇద్దరు నేతలను ప్రధాని అభినందించారు. కాగా రేవంత్, భట్టిలు ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించారు.
ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇందులో ప్రధానంగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీలు ప్లాంటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, సైనిక్ స్కూల్, ఐఐఎం ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు తది తరాలను పొందుపరిచారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యాంశాలు ఇవే..
► ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్ల చొప్పున రూ.2,250 కోట్లను కేంద్రం విడుదల చేసింది. కాగా 2019–20, 21–22, 22–23, 23–24 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1,800 కోట్లు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థికసంఘం నిధులు రూ. 2,233.54 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
► రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదా రులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అందులో కేవలం రెండింటికే ఆమోదం తెలిపారు. మిగతా 12 రహదారుల అప్‌గ్రేడ్‌కు ఆమోదం తెలపాలి.
► ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాబట్టి 2023–24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి.
► పునర్విభజన చట్టం ప్రకారం పూర్వ ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం (బయ్యారం స్టీల్ ప్లాంట్) ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినందున దానిని వెంటనే నెరవేర్చాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దానికి అదనంగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.
► 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్‌లకు ఐటీఐఆర్‌ను ప్రకటించింది. కానీ 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ ఐటీఐఆర్‌ను పక్కనపెట్టారు. దీనిని వెంటనే పునరుద్ధరించాలి.
► పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించారు. దానికి రావల్సినన్ని నిధులు రానందున వెంటనే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి.
► ప్రతి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉంది.. తెలంగాణలో ఐఐఎం లేనందున హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. అందుకు తగిన స్థలం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
► ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక పాఠశాలలు రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో సైనిక్ స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక పాఠశాల ఏర్పాటు చేయాలి.
► భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా దక్షిణాదిలో లేనందున, పుణెలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తరలించాలి.
► రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థల విభజన, పదో షెడ్యూల్‌లోని సంస్థల అంశాలను పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజనకు సహకరించాలి.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భేటీ: భట్టి విక్రమార్క
ప్రధానితో భేటీ వివరాలను రేవంత్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని భట్టి వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుకొనేందుకు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన నిధులు, నీళ్లు, నియామకాలకు సంబంధించిన అంశాలు, హక్కుల విషయంలో గత ప్రభుత్వం పదేళ్లుగా తాత్సారం చేసిందని, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన వాటిని తీసుకురాలేకపోయిందని చెప్పారు.
ఇవే అంశాలను ప్రధానికి వివరించామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని, రాష్ట్రంపై అప్పులతో పెనుభారం మోపిందని విమర్శించారు. అప్పుల నుంచి బయటపడేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇతోధిక సాయం అందించాలని కోరినట్లు వివరించారు. తమ వినతులపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామన్నారని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల సడలింపులపై ప్రధానితో చర్చించలేదని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల నిధులపై చర్చించి వినతిపత్రం ఇచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment