తరిమికొట్టండి
కాంగ్రెస్ నేతలపై పవన్ ధ్వజం
కోలారు/రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ‘పదేళ్ల యూపీఏలో అభివృద్ధి శూన్యం.. ప్రజలు నిరుద్యోగ సమస్యతో కుంగి పోతున్నారు. ధర లేక వ్యవసాయ ఉత్పత్తులను రైతులు రోడ్డున పడేస్తూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుస్థితి తొలగి సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ నేతలను దేశం నుంచి తరిమికొట్టండి’ అని సినీ నటుడు, జన శక్తి పార్టీ సంస్థాపకుడు పవన్‌కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం కోలార్, రాయచూరులో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు.
‘కాంగ్రెస్ నాయకులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. అయితే దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేయని వీరి ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. నింగిని, మింటిని ఏకం చేసేలా యూపీఏ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆకాశంలో తిరిగే హెలికాప్టర్, గాలిలో తేలయాడే 2జీ స్పెక్ట్రమ్, భూమిపైన కామన్‌వెల్త్ క్రీడలు, హౌసింగ్ సొసైటీ, పాతాళంలోని గనులు ఇలా అన్నిటిలో జరిగిన అక్రమాలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే మూల సూత్రధారులు. బీజేపీని విమర్శించే అర్హత రాహుల్‌కు లేదు.
కోలారు జిల్లా ప్రజలు మంచినీటికి ముఖం వాచి ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. ఆరు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కేహెచ్ మునియప్ప మంచి నీటిని అందించలేకపోయారు. ఇది ఆయన చేతకాని తనం. ఒక వేళ నేనే ఎంపీగా ఉన్నట్లయితే ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి ఉండేవాడిని. బంగారు గనులను తెరిపించి కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించాల్సిన ఆయన.. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీజేపీ మతతత్వ పార్టీ కాదు. మోడీ పరమత సహనం గురించి వీరికి తెలియదు.
మోడీ పరిపాలనలో ఎంతో నెమ్మదిగా జీవిస్తున్నామని గతంలో నేను గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లిన సమయంలో ఓ ముస్లిం యువకుడే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన పాపం కాంగ్రెస్‌దే. కర్ణాటకలో నివాసముంటున్న అనేక భాషల ప్రజలు ఐక్యత జీవించడం తనలో స్ఫూర్తి నింపింది.
ఇదే స్ఫూర్తిని తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల్లో నింపుతా. సినీ రంగంలో ఇక నాలుగేళ్లు మాత్రమే కొనసాగుతా. ఆపై జీవితాంతం ప్రజా సేవకే అంకితం. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నేను కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు వెళతా. ప్రజా సేవ చేయడానికే జనసేన పార్టీని ఏర్పాటు చేశాను.’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.