'ఖాళీ కుర్చీలు చూపించి ఇబ్బంది పెట్టొద్దు'
విశాఖ: ఒకప్పుడు చిరంజీవి అంటే చూడటానికి జనం విరగబడి వచ్చేవారు. కాని రాష్ట్ర విభజన డ్రామాలో చిరంజీవి పాత్ర కళ్లారా చూసిన జనం, ఇప్పుడు చిరంజీవి అంటే ఆమడదూరం పారిపోతున్నారు. శ్రీకాకుళం బహిరంగ సభ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. దాంతో ఆయన తమ సభల్లో ఖాళీ కుర్చీలను చూపించవద్దంటూ విలేకర్లను వేడుకోవటం విశేషం. ఖాళీ కుర్చీలు చూపించి తమను ఇబ్బంది పెట్టవద్దని చిరంజీవి శనివారం విశాఖలో మీడియా ప్రతినిధుల్ని కోరారు.
ప్రజాస్వామ్యాన్ని బతికించడానికే... ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. పురందేశ్వరికి మంత్రి పదవులు ఇస్తే కష్టకాలంలో పార్టీని వీడటం దుర్మార్గమన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడడాలని తనకు కూడా సూచనలు ఇచ్చారని... అయితే తాను అవకాశవాదిని కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఏం మంచి చూసి ఇతర పార్టీలకు వెళుతున్నారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు బీజేపీతో కలవటం అధికార దాహమేనని చిరంజీవి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో ఒకలా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ కురుక్షేత్రంలో తామంతా పాండవులమని చిరంజీవి అభివర్ణించారు.