బీజేపీలోకి 'అన్నయ్య'?
తమ్ముడు పవన్ కల్యాణ్ను అన్నయ్య చిరంజీవి ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో కోలుకోలేని విధంగా కాంగ్రెస్ చావుదెబ్బ తినటంతో తమ రాజకీయ భవిష్యత్ను కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు చాలామంది పక్కచూపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చిరంజీవి కూడా చేరినట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్కు చేయిచ్చి.. కమలాన్ని అందుకోవాలనుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
కాగా ఎన్నికల ముందే చిరంజీవి బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించటంతో చిరు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో మోడీ ప్రభంజనంతో బీజేపీ వెలిగిపోవటంతో పాటు, సోదరుడు పవన్ కల్యాణ్ కూడా ఆపార్టీ తరపున ప్రచారం చేసి క్రెడిట్ కొట్టేశారు. దీంతో నరేంద్ర మోడీకి పవన్ దగ్గరయ్యారు. కాంగ్రెస్ హఠావో...దేశ్ బచావో అన్న పవన్ ... తన సోదరుడిని కాంగ్రెస్ నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. చిరంజీవిని కూడా బీజేపీలోకి లాగేందుకు తమ్ముడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు చిరు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
మరోవైపు గతంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను నరేంద్ర మోడీతో కలిపించిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఇప్పుడు చిరంజీవి చేతికి కమలం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచి ఆపార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. పదేళ్ల వరకూ కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేకపోవటంతో చిరుకు కూడా మరో ఆప్షన్ కనిపించటం లేదు. దాంతో చిరంజీవి కూడా త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవచ్చేమో. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.