మోడీని కలవడం తప్పు!
మోడీ-పవన్ కల్యాణ్ భేటీపై చిరంజీవి అసంతృప్తి
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తన తమ్ముడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అవడాన్ని కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారు. ‘‘పవన్ లౌకికవాది. కానీ మతతత్వ బీజేపీని ఆయన కలవడం ఆశ్చర్యంగా ఉంది. పార్టీని పెట్టి పొత్తుల కోసం ఎవరు ఎవరినైనా కలవచ్చు. అది పవన్ ఇష్టం. కానీ గుజరాత్‌లోని గోధ్రా నరమేథంలో మోడీ పాత్రపై అభియోగాలున్నాయి. ఇవేవీ తెలియకుండా పవన్ కల్యాణ్ ఆయనతో చేతులు కలపడం చూస్తుంటే.. తమ్ముడికి అసలు ఆ అల్లర్ల విషయంపై అవగాహన ఉందా? అన్న అనుమానం కలుగుతుంది’’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన బస్సు యాత్ర శనివారం విశాఖకు వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవితోపాటు రఘువీరారెడ్డి తదితరులు ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘పీఆర్‌పీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ పదవులు కోరలేదు. చివరకు కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసినప్పుడు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. నాతో మాట్లాడలేదు. అయినా మాది ఎప్పుడూ కలిసుండే కుటుంబం. చిన్నచిన్న వివాదాలను పెద్దవిగా చేసి చూపడం మా దురదృష్టం’’ అని అన్నారు. ఎన్నికల గంట మోగడంతోనే కాంగ్రెస్‌లో కొందరు నేతలు వేరే పార్టీల్లోకి వలసపోతున్నారని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.
జన్మజన్మలకు బీజేపీతో కలవం అన్న టీడీపీ ఇప్పుడు మతతత్వ పార్టీతో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. ‘మీకు కులాలులేవు. మతాలులేవు. మరి మతతత్వ పార్టీ బీజేపీతో ఎలా కలుస్తారు?’ అంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించడంతో పక్కనే ఉన్న చిరంజీవి ముఖంలో మార్పులు కనిపించాయి.