మోడీతో ముప్పే | Modi needed | Sakshi
Sakshi News home page

మోడీతో ముప్పే

Published Tue, Apr 22 2014 2:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోడీతో ముప్పే - Sakshi

మోడీతో ముప్పే

  • హొసూరు రోడ్‌షోలో కేంద్ర మంత్రి చిరంజీవి
  •  హొసూరు, న్యూస్‌లైన్ : ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపడితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, కావున ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఓటు వేయరాదని ఓటర్లకు మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని హొసూరు, వేపనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ఆయన రోడ్డు షో నిర్వహించి, ప్రసంగించారు.

    బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తమవిగా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు పోతోందని విమర్శించారు. రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలకు పదవులే తప్పా ప్రజా ప్రయోజనాలు ఏ మాత్రం పట్టలేదని మండిపడ్డారు. తమిళనాడులో అమలు అవుతున్న ఉచిత బియ్యం పథకం కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.

    తమిళనాడులో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ. ఆరు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. తమిళ భాషాభివృద్ధికి రూ. వంద కోట్లు కేటాయించింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. 65 సంవత్సరాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ఏ ఒక్క ప్రాజెక్ట్‌నైనా తాగు, సాగునీటి కోసం నిర్మించారా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి పట్టం కట్టినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

    తమిళనాడుకు విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో కూడంకులం అణువిద్యుత్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, జయ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని మండిపడ్డారు. 108 అంబులెన్స్ సర్వీసులు కేంద్ర ప్రభుత్వానివేనని, డ్రైవర్ జీతభత్యాల మొదలు డీజిల్ వరకూ అన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.

    వీటన్నింటిని తామే ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర పాలకులు గొప్పలు పోతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ కోత అనేది లేకుండా పోయిందని, తమిళనాడులో రోజులకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్ పాల్గొన్నారు.
     
    పరువు తీసిన ప్రచారం..

     
    హొసూరులోని గాంధీ విగ్రహం ఎదుట చిరంజీవి చేసిన ఎన్నికల ప్రసంగం కాంగ్రెస్ పార్టీని అభాసు పాలు చేసింది.  తప్పుడు వివరాలను వివరిస్తున్నప్పుడు అక్కడున్న వారంతా ఏవగించుకున్నారు. హొసూరు జాతీయ రహదారిని నాలుగులైన్ల రహదారిగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నప్పుడు ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఎందుకంటే నాలుగు లైన్ల రహదారిని ప్రస్తుతం ఆరు లైన్ల రహదారిగా చేస్తున్నారు. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.

    65 ఏళ్లలో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్న విమర్శపై కూడా ప్రజలు నవ్వుకున్నారు. హొగేనకల్, కృష్ణా (తెలుగుగంగ) తాగునీటి ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చింది ఈ రెండు పార్టీలే. కుడంకులం అణువిద్యుత్ కేంద్రాన్ని తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ చిరంజీవి చేసిన ప్రసంగం అభాసు పాలు చేసింది. అభిమానులు సైతం చిరంజీవి ప్రసంగంపై పెదవి విరిచారు.

    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి పెద్దగా మాట్లాడకుండా తాను షూటింగ్‌ల కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తన సొంత డబ్బా కొట్టుకున్నారు.  దీన్ని పలువురు బాహటంగానే విమర్శించారు. అరగంట పాటు సాగిన చిరంజీవి ప్రసంగంలో ఓటర్లను ఆకట్టుకునే అంశమేదీ లేకపోవడంతో సొంత పార్టీ నేతలు కుదేలయ్యారు. చిరంజీవి ప్రచారం వల్ల లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన స్థానిక కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement