ఔచిత్యమేమిటి?
Published Sat, Dec 14 2013 10:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇస్తామంటూ ముందుకొచ్చిన తమకు షరతులు విధించడంలోని ఔచిత్యమేమిటని షీలాదీక్షిత్ సర్కారులో మంత్రులుగా పనిచేసిన హరూన్ యూసఫ్, అర్వీందర్‌సింగ్ లవ్లీ ప్రశ్నించారు. శనివారం వారిరువురూ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన షరతులతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తోందని, ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతనుంచి తప్పించుకోజూస్తోందని ఆరోపించారు. ‘ఈ రోజు వారు సోనియా గాంధీకి లేఖ రాశారు, రేపు ఐక్యరాజ్యసమితికి లేఖ రాస్తారు’ అంటూ ఎగతాళి చేశారు. ఆప్ లేఖకు తమ పార్టీ అధికారికంగా సమాధానం ఇస్తుందని, తాము కేవలం తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నామన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు గెలిపించారని, ప్రభుత్వ ఏర్పాటుకు వెలుపలినుంచి మద్దతు ఇస్తానని తమ పార్టీ తెలియజేసిందన్నారు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని సూచించారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమకు షరతులను విధించడం సమంజసం కాదని, ఈ షరతుల్లో అనేకం తమ పార్టీ కార్యనిర్వాహక వర్గం నిర్వర్తించేవని వారు చెప్పారు. కార్యనిర్వాహక వర్గం నిర్వహించే పనులకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు అవసరమే లేదని అన్నారు. తాము ఆప్‌కు విధానసభలో మాత్రమే ఇస్తామని, పాలనాపరమైన విషయాల్లో తమ మద్దతు అవసరం లేదని అర్వీందర్‌సింగ్ లవ్లీ చెప్పారు. విద్యుత్ చార్జీలను తగ్గించడం, అవినీతిపరులపై దర్యాప్తు జరపడం, నీటి సరఫరామెరుగుపరచడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి, కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటాయని, వాటికి విధానసభలో మద్దతుతో సంబంధం లేదన్నారు.
కార్యనిర్వాహక వర్గం నిర్వర్తించే విధులకు శాసనసభ అంగీకారం అవసరం లేదని వారు చెప్పారు. అందువల్ల షర తులతో పనేలేదని ఆయన చెప్పారు. రాజకీయాల్లో అనుభవం లేనందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు శాసనసభాపరమైన విధులకు, కార్యనిర్వాహకవర్గం విధులకు మధ్య తేడా తెలియక పొరబడుతున్నారని వారు చెప్పారు. విద్యుత్ సంస్థల ఆడిట్ అంశం హైకోర్టులో ఉందని హరూన్ యూసఫ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తమ వాగ్దానాలను నెరవేర్చి ఢిల్లీని తమకంటే బాగా అభివృద్ధి చేయాలని లవ్లీ కోరారు. ఒకసారి మద్దతు లేఖ ఇచ్చిన త ర్వాత ఆరు నెలల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే వీల్లేదని, అందువల్ల ఆప్ ప్రభుత్వం ఈలోగా తమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలని సలహా ఇచ్చారు. హామీలు నెరవేర్చినట్లయితే ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని ఆయన సూచించారు.
Advertisement