అందులో రాజకీయాలు లేవు
తమిళసినిమా: నడిగర్ సంఘం ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోటీ వర్గాల్లో సెగలు పుడుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మరోపక్క తామే గెలుస్తామని ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో సంగం సభ్యుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. గురువారం ప్రస్తుతం సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి జట్టు మళ్లీ పోటీకి సిద్ధమైంది. వీరికి పోటీగా నటుడు విశాల్ జట్టు బరిలోకి దిగుతోంది. కాగా శరత్‌కుమార్ గురువారం మదురై వెళ్లి అక్కడి నటనారంగ కళాకారుల మద్దతు కోరే ప్రయత్నం చేశారు. అక్కడే ఆధ్యాత్మిక పీఠాన్ని సందర్శించి, విలేకరులతో మాట్లాడారు. నడిగర్ సంఘం విషయంలో కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నటుడు విశాల్ మదురైలో మాట్లాడుతూ నడిగర్ సంఘం విషయంలో ఎవరూ రాజకీయాలు చేయడం లేదని శరత్‌కుమార్ వ్యాఖ్యలకు బదులిచ్చారు.
ఆ కోరికలు అంగీకరిస్తే..
విశాల్ మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను శరత్‌కుమార్ అంగీకరిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతామని అన్నారు. అందులో ముఖ్యమైంది సంఘం భవన నిర్మాణం చేపట్టాల న్నారు. అందుకు తామంతా ఒక చిత్రంలో ఫ్రీగా నటించి నిధిని సమకూర్చడానికి సిద్ధమన్నారు. ఈ సినీ దిగ్గజాలు నాటక రంగం నుంచి వచ్చిన దివంగత మహానటులు ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి పలువురు నెలకొల్పిన సంఘం నడిగర్ సంఘం అన్నారు. ఈ సంఘంలో రంగస్థల నటులు ఒక అంగం అన్నారు. అలాంటి సంఘంలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసమే తాము ఇక్కడికి వచ్చామని అన్నారు. రంగస్థల నటులను డబ్బుతో మభ్యపెట్టి తమ పక్క తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఫిర్కాదులు అందుతున్నాయన్నారు. అలా నాటక కళాకారులకు డబ్బులిస్తే సంతోషమేనన్నారు. కళాకారులు లేకపోతే సినీ కళాకారులు లేరని విశాల్ పేర్కొన్నారు. ఆయనతో పాటు నటుడు కార్తీ, నాజర్ తదితరులు ఉన్నారు.