
150ఏళ్ల పోస్టాఫీసు కోసం..
అన్నానగర్, న్యూస్‌లైన్: కన్యాకుమారి జిల్లా కుళితురై గ్రామంలో ట్రావెన్‌కోర్ రాజు బలరామ నిర్మించిన 150 ఏళ్ల నాటి పోస్టాఫీసును యథాతథంగా కొనసాగించాలంటూ స్థానికులు పదేళ్లుగా పోరాడుతున్నారు. తొలుత ఈ పాత పోస్టాఫీసును కూల్చివేసేందుకు భారత పురాతత్వ శాఖ పలు ప్రయత్నాలు జరిపినా స్థానికులు ప్రతిఘటించడంతో వారి ఆట సాగలేదు. దీంతో ఆ శాఖ సైతం స్థానికులకు ఆ పోస్టాఫీసుపై ఉన్న ప్రేమను గుర్తించి వారితో పాటుగా కేంద్రానికి అభ్యర్థన లేఖలు పంపడం ఒక విశేషం. ఇది కేవలం పురాతనమైన పోస్టాఫీసు మాత్రమే కాదని, ఒక టూరిస్టు ఆకర్షణ కూడా అని శాఖ పేర్కొంది. భారత్‌పోస్టల్ శాఖ సైతం 2012లో దీని కూల్చడానికి ప్రయత్నించి విఫలమైంది.
కుళితురై గ్రామంలోని ఏ ఇంటి గురించైనా తెలుసుకోవాలంటే కొత్త వ్యక్తులు ఈ పోస్టాఫీసు వద్దకు వచ్చి తెలుసుకొని వెళుతుంటారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే స్థానికులు ఈ పోస్టాఫీసు ముందున్న తపాల పెట్టెలో తమ అప్లికేషన్లను వేస్తే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకంతో ఉండడం గమనార్హం. దీనికి తగినట్లుగా ఆ తపాలా పెట్టెపైన ‘విష్ యు గుడ్‌లక్’ అని వ్రాసి వుండటం స్థానికుల నమ్మకానికి ఊతాన్ని ఇస్తోంది. అయితే రాత్రి వేళల్లో ఈ భవనంలోకి తాగుబోతులు, వ్యభిచారులు చేరి నానా హంగామా చేస్తుంటారని, ఈ విషయమై సౌత్‌జోన్ పోస్టుమాస్టర్ జనరల్‌కు స్థానికులు లేఖ రాస్తే దానికి ఎటువంటి సమాధానం లేదని స్థానికులు వాపోయారు.