అమలుకు నోచుకోని గత ప్రభుత్వాల ‘ఒప్పందాల’
ప్రతిబంధకంగా మారిన మైనింగ్ పాలసీ
బెంగళూరు: తమ రాష్ట్రం పెట్టుబడుదారులకు స్వర్గంధామం...ఏక గవాక్ష విధానంలో అనుమతులు... ఇవి కర్ణాటక ప్రభుత్వం చెబుతున్న విషయాలు అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. గత భారతీయ జనతా పార్టీ హయాంతో పాటు ప్రస్తుత సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఈ రెండు ప్రభుత్వాలను పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ (2012-13 నుంచి ఇప్పటి వరకూ) కంటే గత బీజేపీ ప్రభుత్వమే (2008-12) నయమని ప్రభుత్వ గణాంకాలే వివరిస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుదారులను ఆకర్షించి వారి ద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేసి తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గత భారతీయ జనతా పార్టీ తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో 2010, 2012 ఏడాదిల్లో రెండు సార్లు గోబెల్ ఇన్వెస్టర్స్ మీట్ (జీఐఎం-జిమ్)ను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ రెండు జిమ్‌లలో కలపి మొత్తం 1,140 అవగాహన ఒప్పందాలు జరుగ్గా వీటిలో ఇప్పటి వరకూ కేవలం 130 ఒప్పందాలకు మాత్రమే అమల్లోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలకు సంబంధించిన దస్త్రాలన్నీ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల టేబుల్ సొరగుల్లో దుమ్ముపట్టి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నారు. ఉక్కు తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్సెల్లార్ మిట్టల్, పోస్కో సంస్థలు ఈ రంగంలో కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడం కోసం 2010 ఏడాదిలో జరిగిన జిమ్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే అటు పై రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ పాలసీలో మార్పులు తీసుకురావడం, సదరు పాలసీలోని నిబంధనలు పెట్టుబడిదారులకు ప్రతిబంధకాలుగా మారడంతో ఆ రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టలేకపోయాయి. మిగిలిన ఒప్పందాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ఇక రహదారులు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుడంటంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంలేదు. ఐదేళ్ల ముందు కలబుర్గీ, విజయపుర, శివమొగ్గ, హాసన్, బళ్లారిలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ చర్యలు చేపట్టనేలేదు. ఈ విషయమై ఐటీ, బీటీ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...‘హుబ్లీలోని దాదాపు వెయ్యి ఎకరాల్లో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి చదరపు అడుగును రూ.20 లెక్కన అద్దెకిస్తామని చెప్పాం.
బెంగళూరుతో పోలిస్తే ఈ అద్దె దాదాపు ఎనభై నుంచి తొంబై శాతం తక్కువ. అయితే వాయు, రోడ్డు తదితర మార్గాల్లో సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో నూతన సంస్థలు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. అందువల్ల సదరు అద్దెను రూ.10కి తగ్గించాం. మౌలిక సదుపాయాలు మెరుగుపరచనంత వరకూ అద్దె తగ్గించడం, పన్నుల్లో రాయితీ వంటి ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూపించినా ఏ మాత్రం ఉపయోగం ఉండదు.’ అని తెలిపారు.
సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో మరీ తీసికట్టు...
రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారిగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం ‘జిమ్’ పేరును కాస్తా ఇన్వెస్ట్ కర్ణాటకగా మార్పు చేసి 2016 ఏడాదిలో బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ ద్విచక్రవాహన తయారీ కంపెనీ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ- కామర్స్ విభాగంలోని ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కూడా కర్ణాటకను కాదని పొరుగు రాష్ట్రంలో తన గోదామును ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య చైర్మన్‌గా ఉన్న హైలెవెల్ క్లియరెన్స్ కమిటీ (హెచ్‌ఎల్‌సీసీ), స్టేట్‌లెవెల్ సింగిల్ విండో కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌డబ్ల్యూసీ)లు రాష్ట్రంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో పలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ రెండు కమిటీల నుంచి అనుమతులు పొందే ప్రాజెక్టుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతోంది. 2012-13లో 776 ప్రాజెక్టులకు అనుమతులు లభించగా 2014-15లో ఆ సంఖ్య 108కి తగ్గిపోయింది. పోని అనుమతులు పొందిన సంస్థలైనా రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయా అంటే అదీ లేదు. 2012-13 ఏడాదిలో అనుమతులు పొందిన ప్రాజెక్టుల్లో 36 ప్రాజెక్టుల అమలు వివిధ దశల్లో ఉండగా గత ఏడాది ఈ సంఖ్య ఏడుకు తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంలో పారిశ్రమల స్థానపనకు గల పరిస్థితులు వాటి అమలు తీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది.
ఒప్పందం ఘనం... అమలే ప్రశ్నార్థకం ?
Published Fri, Feb 5 2016 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement