నిందితులను జైలుకు తరలిస్తున్న దృశ్యం
కేకే.నగర్ : రైతును హత్య చేసిన కేసులో దంపతులకు యావజ్జీవం, వారికి సహాయపడిన రైతు అన్నకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తేని జిల్లా సెషెన్స్ కోర్టు తీర్పునిచ్చింది. విరుదునగర్ జిల్లా ముత్తులింగపురానికి చెందిన భోజరాజ్(50) రైతు. ఇతని భార్య భాగ్యలక్ష్మి(48). భార్య, భర్త మధ్య ఏర్పడిన తగాదాల కారణంగా భోజరాజ్ 2012లో తేని జిల్లా దేవారం వచ్చి ఆ ప్రాంతంలోని రంగనాథన్(55) ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. భోజరాజ్ అన్న అమృతరాజ్ అదే ప్రాంతంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఈ స్థితిలో భోజరాజ్ భార్య మీద కోపంతో తనకు సొంతమైన ఎనిమిది ఎకరాల పొలాన్ని అన్న అమృతరాజ్‌కు రాసి ఇచ్చేశాడు. ఆ పొలాన్ని అమృతరాజ్ రంగనాథన్‌కు విక్రయించాడు.
ఈ నేపథ్యంలో 2012 జూలై 30న భోజరాజ్ మృతి చెందినట్టు భార్య భాగ్యలక్ష్మికి సమాచారం అందింది. అతని మృతదేహాన్ని ఇంటి యజమాని రంగనాథన్, అతని భార్య అళగమ్మాల్(49), అమృతరాజ్‌లు సొంతఊరికి తీసుకొచ్చారు. భర్త మృతిపై అనుమానంతో భాగలక్ష్మి దేవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో అతడిని హత్య చేసినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో భోజరాజ్ అన్నకు రాసిచ్చిన పొలాన్ని తిరిగి ఇవ్వమని అడగడంతో భోజరాజ్‌ను అమృతరాజ్ సహాయంతో రంగనాథన్, అళగమ్మాళ్‌లు హత్య చేసినట్లు తెలిసింది.
ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తేని జిల్లా సెషన్స్ కోర్టులో సోమవారం తుది విచారణకు వచ్చింది. కేసు పరిశీలించిన న్యాయమూర్తులు రంగనాథన్, అళగమ్మాళ్‌కు యావజ్జీవం, అమృతరాజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. పోలీసులు ముగ్గురిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.