కోర్టు స్టే బాబుకేనా.. పేదలకు వర్తించదా!
► వారంలోపు కరకట్ట వాసులకు నీరు, విద్యుత్ ఇవ్వాలి
► హైకోర్టు స్టే ఉత్తర్వులు అమలు చేయకపోతే ఉద్యమమే
► సీపీఎం నేత బాబూరావు
విజయవాడ : ‘ఓటుకు కోట్లు కేసులో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అదే కోర్టు పేద ప్రజలకు ఇచ్చిన స్టేను ఎందుకు అమలు చేయరు? కరకట్టవాసులకు నిలిపివేసిన తాగునీరు, విద్యుత్ సరఫరాను వారం రోజులలోపు పునరుద్ధరించాలి. హైకోర్టు ఇచ్చిన స్టేను తక్షణమే అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు.
ఆదివారం ఆయన న్యాయవాది సంపర శ్రీనివాస్‌తో కలిసి భవానీపురం కరకట్ట ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు కోర్టు స్టే గురించి వివరించారు. నదీ తీరాల సుందరీకరణ పేరుతో భవానీపురం కరకట్ట ప్రాంతంలోని నివాసాలను ప్రభుత్వం తొలగించే ప్రక్రియలో భాగంగా, తమకు సముచితమైన నష్టపరిహారం ఇచ్చే వరకు ఇళ్లను తొలగించవద్దంటూ సుమారు 70 కుటుంబాలకుపైగా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే వారు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఇళ్ల తొలగింపును నిలుపుదల చేసుకోవడం నచ్చని ప్రభుత్వం.. సుమారు 70 రోజుల నుంచి కరకట్టవాసులకు తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. దీంతో హైకోర్టు న్యాయవాది తిరుమలశెట్టి కిరణ్, నగరానికి చెందిన న్యాయవాది సంపర శ్రీనివాస్ బాధితుల తరఫున తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితులకు వారం రోజులలోపు తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఈ నెల ఒకటో తేదీన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్‌ఎస్ రామచంద్రరావు స్టే ఇచ్చారు.
రౌడీయిజానికి దిగితే ఊరుకోం: కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం బాబూరావు మాట్లాడుతూ కోర్టును కాదని ప్రభుత్వం అధికారయుతమైన రౌడీయిజానికి దిగితే ఊరుకోబోమని, పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.