♦ గుర్తించిన ఢిల్లీ పోలీసులు
♦ అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయంటున్న పోలీసులు
♦ స్టేషన్లు, ఆ పరిసర ప్రాంతాల్లో లైట్లు లేకపోవడమే కారణం
సాక్షి, న్యూఢిల్లీ : నేరాలకు నిలయాలుగా మారిన నగరంలోని 18 మెట్రో స్టేషన్లను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ మెట్రో స్టేషన్ల పరిసరాల్లో వెలుతురు సరిగా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయని పోలీసులు తెలిపారు. చీకటిగా ఉన్న ఈ ప్రాంతాల్లో నేరాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో మహిళల భద్రతకు ముప్పు అవకాశం ఉందని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కొన్ని పార్కింగ్ ఏరియాల్లో అయితే లైట్లు కూడా లేవన్నారు.
కొన్ని మెట్రో స్టేషన్లకు వెళ్లే రహదారులపై అసలు వీధి దీపాలే లేవన్న సంగతి పోలీసుల విచారణలో తేలింది. నార్త్ ఢిల్లీలోని పుల్ బంగష్ మెట్రో స్టేషన్‌లో లైట్లు సరిగ్గా లేకపోవడంతో కొంత మంది దుండగులు తనను వెంబడించి వేధిస్తున్నట్లు ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు మహిళా భద్రతా యాప్ హిమ్మత్ ద్వారా తెలపింది. దీంతో స్పందించిన పోలీసులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. పోలీసు కంట్రోల్ రూమ్ విభాగం, స్థానిక పోలీసుల సహాయంతో ఈ సర్వే నిర్వహించారు.
సర్వే వివరాలు..
ఢిల్లీ మెట్రోలో మొత్తం 138 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పటేల్ చౌక్, జహంగీర్‌పురి, నే తాజీ సుభాష్ ప్లేస్, అక్షర్‌ధామ్ మందిర్, మయూర్ విహార్-ఫేజ్ 1 ఎక్స్‌టెన్షన్, షాదీపుర్, పుల్ బంగష్, ఉత్తమ్‌నగర్ ఈస్ట్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, పీరా ఘడీ, నాంగ్లోయ్, ద్వారకా మోడ్, ద్వారకా సెక్టర్-9, 10, 11, 12, 13, 14 స్టేషన్ల పరిసరాల్లో దీపాలు పనిచేయడం లేదని విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఉత్తం నగర్ ఈస్ట్, ఉత్తంనగర్, వెస్ట్, పీరా ఘడీ, నాంగ్లోయ్, ద్వారకా సెక్టర్-14, ద్వారకా సెక్టర్-13 స్టేషన్లలోని పార్కింగ్ ప్రదేశాల్లో అసలు దీపాలే లేవు. ద్వారకా మోడ్, ద్వారకా సెక్టర్-14, ద్వారకా సెక్టర్-13, అక్షర్‌ధామ్ మందిర్, మయూర్ విహార్-ఫేజ్ 1 ఎక్స్‌టెన్షన్, పుల్ బంగష్, షాదీపుర్ పరిసరాలు చీకటిమయంగా ఉన్నాయని తేలింది.
సర్వే నివేదిక పరిశీలించిన ప్రత్యేక కమిషనర్ సుందరి నందా మాట్లాడుతూ, మెట్రోస్టేషన్ల పరిసరాలలో లైటింగ్ సరిగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. మెట్రో స్టేషన్లకు వెళ్లే వీధుల్లో నేరాలు జరగకుండా ఉండాలంటే లైటింగ్ తప్పనిసరని చెప్పారు. రాత్రి పూట చీకటిగా ఉండే వీధుల్లో తమ పెట్రోలింగ్ వ్యాన్లు గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు. అవి తిరిగినా కూడా వీధి దీపాలు మాత్రం తప్పకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు.
నేరాలకు అడ్డాగా 18 మెట్రోస్టేషన్లు
Published Thu, Apr 16 2015 10:37 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement