సాక్షి, ముంబై: నగరంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు భద్రతపై అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు భద్రతకు పెద్ద పీటవేస్తున్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో ఒక పురుష, ఒక మహిళా భద్రతా సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని నిర్ణయించారు. వీరు ప్రయాణికుల్లాగా సాధారణ దుస్తుల్లో అటూ ఇటూ తిరుగుతుంటారు. వచ్చి, పోయే వారితోపాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వేస్తారు.
ఈ సిబ్బంది మారువేషాల్లో ఉండడంవల్ల ఎవరికీ అనుమానం రాదు. దీంతో అనుమానితులను వెంటనే పట్టుకునే అవకాశముంటుంది. ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ముంబై ఉండడంవల్ల ఎప్పుడు, ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ భద్రత కోసం స్థానిక పోలీసులకు తోడుగా వివిధ దళాల భద్రత సిబ్బందిని ఇదివరకే మోహరించిన విషయం తెలిసిందే. వీరి దగ్గర డోరు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు ఉంటాయి. అయినా ముంబైలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న మెట్రోకు మరింత భద్రతను రిలయన్స్ ఇన్‌ఫ్రా కల్పిస్తోంది.
ఎప్పుడు ప్రారంభమయ్యేనో...?
రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న మెట్రో రైలు ఇదివరకు 11 సార్లు ఇచ్చిన డెడ్‌లైన్‌లు వాయిదాపడ్డాయి. దీంతో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఆ ప్రాజె క్ట్ చేపడుతున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు కూడా తెలియని పరిస్ధితి నెలకొంది. అయితే భద్రతకు మాత్రం పెద్దపీట వేస్తోంది. వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ 11.40 కి.మీ. ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవల రైల్వే భద్రత కమిషనర్ ద్వారాసేఫ్టీ సర్టిఫికెట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఇక రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే మిగిలిఉంది. మొత్తం 12 మెట్రో స్టేషన్‌లు, ఆవరణలు, బోగీలలో ఇలా మొత్తం 700 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఇవి 24 గంటల పనిచేయనున్నాయి. ప్రతి స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లేందుకు వీలుండదు. ఈ పేలుడు పదార్థాలను పోలీసుల కళ్లుగప్పి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు.
మెట్రోకు మరింత భద్రత
Published Wed, May 21 2014 10:52 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement