రాష్ట్రంలోని మీడియా రంగం గురువారం ఉలిక్కి పడింది. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో ఓ చానల్‌పై హిందూ యువజన సేన మూకలు వీరంగం సృష్టించాయి. వరుస పేలుళ్లతో పోలీసులు ఉరకలు తీశారు. మీడియాపై దాడిని సర్వత్రా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, చెన్నై: కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో కొన్ని హిందూ సంఘాలు తమ ఉనికిని చాటుకునే పనిలో పడ్డాయి. సమాజ హితాన్ని కాంక్షిస్తూ కొన్ని సంఘాలు పనిచేస్తుంటే, మరికొన్ని సంఘాలు వివాదాలతో ముందుకు సాగే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మహిళా దినోత్స వం సందర్భంగా పుదియ తలమురై న్యూస్ చానల్ ‘పసుపు తాడు..తాళి బొట్టు’ విలువను ఎత్తి చూపుతూ ప్రత్యేక కథనానికి నిర్ణయించింది. ఆ చానల్ ప్రసారం చేస్తున్న ప్రొమో, కర్టన్ రైజర్‌ను చూసిన కొన్ని హిందూ సంఘాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశాయి. దీంతో ఆ ప్రసారం నిలుపుదల చేయడానికి ఆ చానల్ నిర్ణయించింది. అయితే, ఎక్కడ ఆ కథనం ప్రసారం అవుతుందోనన్న ఆగ్రహంతో గిండిలోని ఆ చానల్ కార్యాలయంపై దాడి జరిగింది. మహిళా దినోత్సవం రోజున మహిళా జర్నలిస్టుపై, ఓ కెమెరా మెన్‌పై ఆ మూకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసులు సైతం మెతక వైఖరి అనుసరించారన్న విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మరువక ముందే, అదే చానల్ కార్యాలయంలో గురువారం వేకువ జామును టిఫిన్ బాక్సులలో అమర్చిన బాంబులతో దాడి జరగడం రాష్ర్టంలోని మీడియా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
వేకువ జామున మూడు గంటల సమయంలో రెండు మోటార్ బైక్‌ల మీద వచ్చిన నలుగురు వ్యక్తులు కాసేపు ఆ మీడియా చానల్ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో చక్కర్లు కొట్టారు. వెళ్తూ...వెళ్తూ ఆ చానల్ కార్యాలయం సమీపంలోని ఓ చెట్టు కింద ఆగి అక్కడి నుంచి టిఫిన్ బాక్స్ బాంబుల్సి విసిరి ఉడాయించారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఒక్క సారిగా పెద్ద శబ్ధంతో రెండు బాంబులు పేలడంతో అక్కడి సిబ్బందితో పాటుగా,ఆ పరిసరవాసులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. బాంబులు పేలిన శబ్దం రావడంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. అయితే, ఈ పేలుళ్లలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాడి సమాచారంతో గిండి పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి.
కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ టీవీ చానల్ పరిసరాల్లోని నిఘా కెమెరాలతో పాటుగా ఆ మార్గంలో ఉన్న మరికొన్ని సంస్థలకు చెందిన నిఘా కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఆ చానల్ కార్యాలయం పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. టిఫిన్ బాక్సు రూపంలో బాంబులు రెండింటిని పేల్చడంతో మీడియా వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇలాంటి దాడి జరగడంతో, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఈ దాడి తన సేనలతో తానే చేయించానంటూ హిందూ యువజన సేన నాయకుడు జయం పాండియన్ మదురై కోర్టులో లొంగిపోయాడు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, టీఎంసీ అధ్యక్షుడు జికే వాసన్, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణిలతో పాటుగా పలు ప్రజా సంఘాల నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. మీడియా సంఘాల నేతృత్వంలో నిరసలనకు నిర్ణయించారు. అలాగే, సీపీఎం, సీపీఐల నేతృత్వంలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు.
ఉలిక్కిపడ్డ మీడియా
Published Fri, Mar 13 2015 3:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement