పెద్ద నోట్ల రద్దుతో ‘రియల్‌’ చిత్రాలు | currency ban effects real estate business | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్ల రద్దుతో ‘రియల్‌’ చిత్రాలు

Published Sun, Nov 13 2016 9:15 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్‌బీఐ వద్ద బారులు తీరిన ప్రజలు - Sakshi

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్‌బీఐ వద్ద బారులు తీరిన ప్రజలు

పెద్ద నోట్లకే పొలం, స్థలం అమ్ముతామంటున్న బ్రోకర్లు
భూముల ధరల నిలుపుదలకు వ్యూహం
 
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు చిత్ర విచిత్ర విన్యాసాలకు దారితీస్తోంది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో కోట్లు పెట్టి పొలాలు, స్థలాలు కొనే పరిస్థితికి చెక్‌ పడింది. దీంతో గడిచిన నాలుగు రోజులుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అమాంతం కుప్పకూలింది. సరిగ్గా ఇదే అవకాశాన్ని మధ్యవర్తులు(బ్రోకర్లు) సానుకూలంగా మలుచుకునే యత్నం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరుల్లోనూ కొత్త ట్రెండ్‌కు తెరతీశారు.

అటు పొలాలు, స్థలాలు ధరలు పడిపోకుండా, నల్ల డబ్బు చెల్లుబాటు అయ్యేలా ఉభయ తారకమైన ఫార్మూలను తెరమీదకు తెచ్చారు. పాత నోట్లకే పొలాలు అమ్ముతామంటూ డబ్బున్న ఆసాములకు ఫోన్‌ లు చేసి దారిలో పెడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిపోయిన తరుణంలో కొనుక్కుంటే లాభదాయకంగా ఉంటుందని నచ్చజెపుతున్నారు. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకుని వాళ్లు ఏదోలా వాటిని మార్చుకుంటారని ధీమాగా చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ఒకాయనకు ఫోన్‌ చేసి ఎకరంన్నర పొలం రెడీగా ఉంది.. భవిష్యత్‌లో లేఅవుట్‌ వేసుకోవడానికి బాగుంటుంది.. పాత నోట్లు ఉంటే సిద్ధం చేసుకోమని చెప్పడం గమనార్హం.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జువ్వలపాలెం రోడ్డు శివారున ఒక స్థలాన్ని కూడా ఇలాగే పాత కరెన్సీకే విక్రయిస్తామని మధ్యవర్తులు బేరసారాలు జరుపుతున్నారు. అదే ప్రాంతంలోని ఒక గ్రామంలో మొన్నటి వరకు సెంటు భూమి రూ. 6.50 లక్షలకు బేరం జరిగిందని, నోట్ల రద్దు వల్ల రూ.5 లక్షలకే ఇస్తానని ఆ స్థలం యజమాని చెప్పడం విశేషం. అది కూడా పాత నోట్లు ఇస్తే తీసుకుంటామని, మార్చుకోవడానికి తనకు ఆదాయ పన్ను వెసులుబాటు ఉందని చెప్పడం గమనార్హం.
 
పాత నోట్ల పేచీ..
కొన్ని చోట్ల మాత్రం పాత నోట్ల పేచీలు ఎక్కువయ్యాయి. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే పొలాలు, స్థలాల కొనుగోళ్ల ఒప్పందాలు జరిగిన ప్రాంతాల్లో వివాదాలు చెలరేగుతున్నాయి. పెద్ద నోట్లు రద్దుకాక ముందే కొనుగోలు చేశాం కాబట్టి పాత నోట్లే ఇస్తామని కొనుగోలుదారులు.. రద్దు అయ్యాక ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం కాబట్టి కొత్త నోట్లే కావాలని అమ్మకందారులు పంతాలకు పోతున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో ఇలాంటి వివాదానికి దిగిన క్రయవిక్రయదారులు పాత అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన అడ్వాన్సును కొనుగోలుదారుడు వదులుకోవాల్సిందేనని మధ్యవర్తులు తీర్పు చెప్పడం గమనార్హం. మరికొన్ని చోట్ల పాత నోట్లు చెల్లుబాటుకాక, అంత పెద్ద మొత్తాలు కొత్త నోట్లు ఇవ్వలేక కొందరు గతంలో అగ్రిమెంట్లు చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు కొంతకాలం వాయిదా వేసుకుంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement