
‘రియల్’ వ్యాపారంపై సమాధానం చెప్పండి
ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సమీకరిస్తున్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయతలపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తక్షణమే సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
రాజధాని విషయంపై ప్రభుత్వానికి అంబటి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సమీకరిస్తున్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయతలపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూముల నుంచి 5 వేల ఎకరాలను బహిరంగంగా వేలం వేసి ఎకరం రూ. 10 కోట్ల నుంచి రూ.15 కోట్లకు అమ్మాలని, తద్వారా రూ. 75 వేల కోట్లను సంపాదించాలని ప్రభుత్వం పథకం వేసుకున్నట్లుగా ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయని అంబటి తెలిపారు.
అసలు రాజధాని కోసమే ఈ భూముల సేకరణ చేస్తున్నారా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారా? అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి చాలా తక్కువ భూమి సరిపోతుందని ఇప్పటికే మేధావులతో సహా అందరూ చెబుతున్నారని, అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 50 వేలు, లక్ష ఎకరాలు సమీకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని తాపత్రయపడుతోందనే విషయం తేటతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు రాజధాని ప్రాంతంలో భూములివ్వాలనుకుంటున్న రైతులను తీవ్రంగా భయపెడుతున్నాయని మండిపడ్డారు.
రైతులతో బేరమా?
‘రైతుల నుంచి సమీకరిస్తున్న భూములను ఎకరా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లకు అమ్ముకుని.. పొలాలిస్తున్న వారికి మాత్రం 1200, వెయ్యి గజాలు ఇస్తామని బేరం పెడతారా?’ అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ వ్యవహారం వాస్తవమా? కాదా? అనేది తొలుత స్పష్టం చేయాలన్నారు. ఈ భూములను ప్రైవేటు సంస్థలకు అమ్మగా వస్తున్న రూ. 75 వేల కోట్లను రైతులకే చెందేలా చూడాలన్నారు. రైతుల నుంచి సమీకరిస్తున్న భూములపై రూ. కోట్లు ఆర్జించాలనే ఆలోచన రావడమే దురదృష్టకరమన్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ వెల్లడించినప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు కావాలంటూ అప్పట్లో విపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేశారని అంబటి గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు సీఎంగా.. తమ మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వమే కేంద్రంలో ఉండగా రూ. 4 లక్షల కోట్లు, రూ. 5 లక్షల కోట్లు కాదు కదా కనీసం రూ. లక్ష కోట్లయినా ఎందుకు తేలేక పోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన విధానంపై పునరాలోచించుకోవాలన్నారు.