డీకే రవిది ఆత్మహత్యే!
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే రవిది(34) ఆత్మహత్యేనని సీబీఐ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒకటి రెండురోజుల్లో నివేదిక అందించనుంది. దాదాపు 20 నెలల క్రితం బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం జాతీయ స్థాయిలో పెద్ద రాద్దాంతమైంది. విపక్షాలు, ప్రజల ఒత్తిడికి తలొగ్గిన సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర అధికారులను విచారించిన సీబీఐ వ్యక్తిగత కారణాల వల్లే డీ.కే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చింది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన నివేదికను అందజేయనుంది.
ఇదిలా ఉండగా డీ.కే రవి తల్లి గౌరమ్మతో పాటు కుటుంబ సభ్యులు డీ.కే రవిది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. తమకున్న అనుమానాలను సీబీఐ అధికారులకు చెప్పడానికి పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని గౌరమ్మ వాపోయారు. ఇక ఈ విషయమై డీ.కే రవి మామ హనుమంతరాయప్ప మాట్లాడుతూ... నివేదికకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు బయటకు వచ్చేంతవరకూ తాను ఏమీ మాట్లాడనన్నారు. ఒక వేళ ఆత్మహత్యకు మా కుంటుంబ సభ్యులే కారణమని తేలితే ఎటువంటి శిక్ష కైనా సిద్ధమని పేర్కొన్నారు.