
వాట్సాప్ ఆఖరి సందేశమే...సూసైడ్ నోటా?
బెంగళూరు: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి ఆఖరి వాట్పాప్ సందేశమే సూసైడ్ నోట్గా పరిగణించబోతున్నారని సమాచారం. విచారణ పూర్తయ్యేవరకు మధ్యంతర నివేదికలను వెల్లడి చేయొద్దని కోరుతూ మహిళా ఐఏఎస్ అధికారి భర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టులో ఈ వాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. డీకే రవితో చివరి వరకు టచ్లో వున్న వ్యక్తి మహిళా ఐఏఎస్ అని పోలీసుల వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు పంపిన కొన్ని వాట్సాప్ సందేశాలను పరిశీలించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
గత వారం తన భార్య చీరతో సీలింగ్కు వేలాడుతూ కనిపించిన డీకే రవి మృతిపై అనేక అనుమానాలు, కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం రవి ఆత్మహత్య చేసుకున్నారని హడావుడిగా ఎందుకు ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి.
రవి మృతిపై సీబీఐ ఎంక్వయిరీ చేపట్టాలని డిమాండ్ చేశాయి. మరోవైపు రవి తల్లిదండ్రులు , కర్నాటక ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు తాము సిద్దమని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన తరువాత కూడా పట్టువీడని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చివరకు సోనియా గాంధీ రంగప్రవేశంతో దిగొచ్చి... డీకే రవి మృతి కేసును సీబీఐ కు అప్పగిస్తున్నట్టు సోమవారం అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే.. మధ్యంతర రిపోర్టుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం చేసిన తప్పును కవర్ చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని వాదిస్తున్నాయి. డీకే రవి వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్పై సీఐడీ, కోర్టు వాదనలను అటు రవి కుటుంబ సభ్యులు కూడా ఇదంతా కుట్ర అని కొట్టి పారేస్తున్నారు.