
తల్లిని హతమార్చి నృత్యకారిణి కిడ్నాప్
చెన్నై యువకుని కోసం గాలింపు
టీనగర్: తల్లిని హతమార్చి నృత్యకారిణిని కిడ్నాప్ చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలం తాదగాపట్టి గేట్ అంబాల్ చెరువు రోడ్డు, ఐదవ క్రాస్ ప్రాంతానికి చెందిన వేలుత్తాయి(65) కుమార్తె విజయలక్ష్మి(29). ఈమె ఆలయ ఉత్సవాలలో కరగాట్టం నృత్యాలు చేస్తుంది. కుటుంబ తగాదాలతో భర్త కార్తి నుంచి విడిపోయిన విజయలక్ష్మి, తల్లి వేలుత్తాయితో నివసిస్తోంది.
భర్త నుంచి విడిపోయిన అనంతరం కరగాట్టం బృందం మాస్టర్ కెన్నడీతో పరిచయం ఏర్పడగా ఒక ఏడాది అతనితో కలిసి ఉంది. తర్వాత రెండు నెలల క్రితం కెన్నడీ నుంచి విడిపోయి చెన్నైకు చెందిన బంధువైన జీవానందం అనే యువకునితో వచ్చేసింది. అతనితో కూడా తగాదా ఏర్పడడంతో తాదగాపట్టిలోఉన్న తల్లి వేలుత్తాయితో నివసిస్తూ వచ్చింది. ఇలాఉండగా ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో సేలంకు వచ్చిన జీవానందం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి తనతో చెన్నై రావాల్సిం దిగా కోరాడు. అందుకు విజయలక్ష్మి నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం ఏర్పడింది.
అంతేకాకుండా.. కుమార్తెను విడవకుండా వేలుత్తాయి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవానందం మంచానికి వేలుత్తాయిని కట్టివేశాడు. తర్వాత ఆమె నోటికి ప్లాస్టర్ వేసి విజయలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. తరువాత కెన్నడీకి ఫోన్ చేసి కిడ్నాప్ చేపినట్టు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను విజయలక్ష్మి ఇంటికి వెళ్లి చూడగా వేలుత్తాయి నిర్జీవంగా కనిపించింది. నోటికి ప్లాస్టర్ అతికించడంతో ఆమె ఊపిరాడక మృతి చెందినట్లు తెలిసింది. దీనిగురించి అన్నదానపట్టి పోలీసులు కేసు నమోదు చేసి జీవానందం కోసం గాలిస్తున్నారు.