అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు
- సినీ దర్శకుడు దాసరి మారుతి
- ‘సాక్షి’ ఇంటర్వ్యూలో యువతకు ఉద్బోధ
మచిలీపట్నం: ఎవరో అవకాశాలను ఇస్తారని ఎదురుచూడకుండా.. వారే సృష్టించుకోవాలని, అప్పుడే వారి ఎదుగుదల ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు దాసరి మారుతి యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం సొంత ఊరు మచిలీపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్నప్పటినుంచీ కళలంటే ఇష్టపడే తాను బందరులో స్టిక్కరింగ్ షాప్‌ను స్థాపించానని, తర్వాత హైదరాబాద్ వెళ్లి యానిమేషన్ నేర్చుకున్నానని చెప్పారు. తాను ఇప్పటివరకూ ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు.
సాక్షి: దర్శకుడిగా మారేందుకు ఎవరు అవకాశం కల్పించారు?
మారుతి : అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో యానిమేషన్ నేర్చుకునేటప్పుడు అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లకు డ్రాయింగ్ నేర్పాను. అలా వారి కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. అంజి చిత్ర యానిమేషన్ వర్క్ అవకాశం వచ్చింది. తర్వాత నేనే సొంతంగా కథ రాసి తక్కువ బడ్జెట్‌లో ‘ఈ రోజుల్లో’ సినిమా తీశా.
సాక్షి: కొత్త సినిమాలు చేస్తున్నారా?
మారుతి : నవంబర్‌లో కొత్త హీరోతో లోబడ్జెట్ సినిమా తీస్తున్నాను. వచ్చే ఏడాది మార్చిలో హీరో నాని, అక్కినేని అఖిల్‌తో సినిమాలు చేసే ప్రయత్నంలో ఉన్నా.
సాక్షి: మీరు తీసిన సినిమాల్లో మీకిష్టమైవి?
మారుతి : నేను తీసిన ఏడు సినిమాలంటేనూ ఇష్టమే. ప్రేమకథాచిత్రమ్, బాబు బంగారం సినిమాలంటే మరీ ఇష్టం.
సాక్షి: మీకిష్టమైన నటుడు, దర్శకులు ఎవరు?
మారుతి : నాకు చిరంజీవిగారంటే ఎంతో ఇష్టం. దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్.
సాక్షి: మీ సొంత ప్రాంతం మచిలీపట్నంలో చిత్రీకరణ చేయడం లేదేమిటి?
మారుతి : ఇక్కడ షూటింగ్‌లకు ఉపయోగపడే లొకేషన్లు ఉన్నాయి. జనసందోహం అధికంగా ఉంటుంది. షూటింగ్‌ను ఫ్రీగా చేయలేం. అందుకే ఇక్కడ చేయలేకపోతున్నాను.
సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం ?
మారుతి : ఈ ప్రాంత యువకులకు పలు కళల్లో మంచి పట్టు ఉంది. తెలిసిన కళపై దృష్టి సారించి ముందుకెళితే అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. అవకాశాలు ఎవరో ఇస్తే ఎదుగుదామనుకుంటే పొరపాటే. ఎవరికి వారే వారి ప్రతిభను నిరూపించుకుంటే అవకాశాలు వాటికవే వస్తాయి. అవకాశాలను నిరూపించుకునేందుకు నేడు పలు వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలి.