తప్పులు చేసేవారు ఎంత తాఫీగా ఉంటారో చెప్పేందుకు ఈ సంఘటనే ఒక ఉదాహరణ.
థానే : తప్పులు చేసేవారు ఎంత తాఫీగా ఉంటారో చెప్పేందుకు ఈ సంఘటనే ఒక ఉదాహరణ. పలు కేసుల్లో నిందితుడైన అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో ఏం చేస్తున్నాడో.. ఏం చక్కా బీర్ కొడుతూ బిర్యానీ తింటూ కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అది చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్న పోలీసులు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కస్కర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. థానే యాంటి ఎక్స్‌టార్షన్ సెల్(ఏఈసీ) అధికారులు ముంబయిలోని హసీనా పార్కర్ ఇంటి నుంచి అతడిని అదుపులోకి తీసుకొని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ’ఇక్బాల్ కస్కర్ నాలుగు ప్లాట్లను, రూ.30లక్షలను ఒక బిల్డర్ నుంచి డిమాండ్ చేశాడు. మా విచారణలో కొంతమంది బిల్డర్లు, రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి’ అని థానే పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కస్కర్ ద్వారా దావూద్ ఇబ్రహీం అక్కడే పాక్‌లోనే ఉన్నాడనే విషయం తెలుసుకునే యత్నాల్లో ఉన్నారు.