
మృతదేహన్ని మార్చి ఇచ్చారు
చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని మార్చి ఇవ్వడంతో కలకలం చెలరేగింది.
చెన్నై : చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని మార్చి ఇవ్వడంతో కలకలం చెలరేగింది. దీంతో పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు. చెన్నై మేడవాక్కం, రంగనాథపురం, ఏరికరై వీధికి చెందిన రామదాస్. ఇతని కుమారుడు మణికంఠన్ (20). మాదకద్రవ్యాలకు అలవాటుపడిన మణికంఠన్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణికంఠన్ మృతిచెందాడు. దీంతో మణికంఠన్ మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చి గురువారం సాయంత్రం మేడవాక్కం శ్మశానవాటికలో పాతిపెట్టారు.
ఈ క్రమంలో క్షయతో మృతి చెందిన వేలూరు వాసి మనోజ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతని కుటుంబీకులు, బంధువులు చెన్నై జీహెచ్ చేరుకున్నారు. ఆ సమయంలో మణికంఠన్ మృతదేహానికి బదులుగా మనోజ్ మృతదేహాన్ని బంధువులు తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన మనోజ్ బంధువులు ఆస్పత్రి ఉద్యోగులతో తగాదాకు దిగారు. దీనిగురించి ఆస్పత్రి ప్రాంగణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే మేడవాక్కం పోలీసు స్టేషన్‌కు సమాచారం తెలిపారు.
పోలీసులు మణికంఠన్ బంధువులతో శుక్రవారం ఉదయం మేడవాక్కం శ్మశానవాటిక చేరుకున్నారు. అక్కడ పాతిపెట్టిన మనోజ్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్ణయించారు. తాంబరం తహవీల్దార్ జయకుమార్ ఆధ్వర్యంలో మనోజ్ మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. జీహెచ్ మార్చురీ నుంచి శవాన్ని మార్చి ఇవ్వడం గురించి తాంబరం ఆర్‌డీవో, ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు విచారణ జరుపుతున్నారు.