
వేదనిలయం వద్ద భధ్రత
సాక్షి, చెన్నై: పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయంలోకి వెళ్లేందుకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ మంగళవారం ప్రయత్నించారు. ఆయన్ను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు పక్కనే ఉన్న మరో భవనంలోకి వెళ్లి కాసేపు కూర్చుని బయటకు వచ్చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయంను స్మారకమందిరంగా మార్నేందుకు ప్రభుత్వం కసరత్తుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇందు కోసం సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ సైతం ఏర్పడింది. అదే సమయంలో జయలలిత ఆస్తులకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా కోర్టు ప్రకటించింది. దీంతో వేదనిలయంపై తమకు హక్కులు ఉన్నట్టు దీప, దీపక్ పేర్కొంటూ వస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం దీపక్ హఠాత్తుగా పోయెస్‌గార్డెన్‌లోకి వచ్చారు. అక్కడి వేదనిలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, పోలీసులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. చివరకు తన వద్ద కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. అయితే, పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. ఆ ఉత్తర్వుల కాపీని పరిశీలించి మౌనంగానే ఉండిపోయారు. లోనికి ఎవర్నీ అనుమతించే అధికారం తమకు లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. అర్థం చేసుకోవాలని దీపక్‌కు సూచించారు. చివరకు వేదనిలయం పక్కనే ఉన్న పాత కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో కాసేపులోపల కూర్చుని బయటకు దీపక్ వచ్చేశారు. అనంతరం కారులో ఆయన వెళ్లిపోయారు. జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
Comments
Please login to add a commentAdd a comment